
పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్’(ఐసీడీఎస్)లో భాగమైన అంగన్‌వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్ 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్‌వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్ వాడీ కర్మచారి సంఘటన్ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక.
దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్ ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్‌కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్ చేశారు. విద్యార్థి దశలో ఎన్‌ఎస్ ఎస్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్‌గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్‌లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు.
భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’లో పని చేశారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బిలాస్‌పూర్ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్‌లో షరతులతో కూడిన బెయిల్ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్‌వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.
వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్
ఎన్. వేణుగోపాల్