సింహం వద్ద సలహదారు ఉద్యోగం! | Sakshi
Sakshi News home page

సింహం వద్ద సలహదారు ఉద్యోగం!

Published Sun, Oct 8 2023 12:21 PM

The Lion And The Fox Story Interesting Stories For Kids - Sakshi

ఉదయగిరి దగ్గర వున్న అడవికి భైరవ అనే  సింహం రాజుగా ఉండేది. సుబుద్ధి అనే నక్క దానికి సలహాదారుగా ఉండేది. ఒక రోజు సాయంత్రం సుబుద్ధి.. దిగాలుగా ఇల్లు చేరింది. ‘అలా ఉన్నావేం? ఒంట్లో బాగా లేదా?’ అంటూ ఆతృతగా అడిగింది సుబుద్ధి భార్య. పెద్దగా నిట్టూర్చి సుబుద్ధి ‘రాజుగారు రేపటి నుంచి రావద్దని చెప్పారు. నా పదవి ఊడింది’ అంది. ‘అయ్యో, ఇప్పుడెలా? ఇంతకీ ఉద్యోగం ఎందుకు పోయినట్లు?’ అడిగింది సుబుద్ధి భార్య.  

‘నాకు వయసు మీద పడిందట. ఇదివరకటిలా చురుగ్గా లేనట. ఇక ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు రాజుగారు’ విచారంగా చెప్పింది సుబుద్ధి.  ‘అలా ఎలా? పోనీ మన అబ్బాయిని సలహాదారుగా పెట్టుకోమని అడగండి’ అన్నది సుబుద్ధి భార్య. ఆ సలహా నచ్చి మర్నాడే తన కొడుకు వీరబుద్ధితో సింహం గుహకి వెళ్ళింది సుబుద్ధి. ‘మహారాజా.. వీడు నా కొడుకు వీరబుద్ధి. వీడిని మీ సలహాదారుగా పెట్టుకోండి. ఎన్నో ఏళ్ళుగా మీ దగ్గర నమ్మకంగా పని చేశాను. అన్యాయం చేయకండి’ అని వేడుకుంది సుబుద్ధి. 

సింహం నవ్వి ‘అలాగే.. చూస్తాను. వీడిని నా దగ్గర వదిలి వెళ్ళు’ అంది. వీరబుద్ధి రోజంతా గుహ బయటే కూర్చుంది. దానికి ఏ పనీ లేదు. తిండికీ లోటు లేదు. రాత్రి ఇంటికి వస్తూనే వీరబుద్ధి..‘అమ్మా.. ఇన్నాళ్లూ నాన్న చేసిన ఉద్యోగం.. రోజంతా గుహ బయట కూర్చుని,  మూడు పూటలా భోంచేసి రావడం.. అంతే!’ అన్నది పెద్దగా నవ్వుతూ. మర్నాడు సింహం గుహ బయట పచార్లు చేస్తూండగా గూఢచారిగా పనిచేసే గద్ద ఒక దుర్వార్త మోసుకుని వచ్చింది. భైరవకోనలో ఉండే సింహం.. అక్కడ కరువు నెలకొనడంతో పొరుగున సుభిక్షంగా ఉన్న ఉదయగిరి అడవి మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.. మహారాజా!’ అంటూ.

‘సమాచారం చేరవేసినందుకు ధన్యవాదాలు. ఏం చేయాలో మేం ఆలోచిస్తాం. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అంది సింహం గంభీరంగా. ‘చిత్తం’ అంటూ రివ్వున ఎగిరిపోయింది గద్ద. దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘నీ సలహా ఏమిటి? ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలి?’ అంటూ అక్కడే ఉన్న వీరబుద్ధిని అడిగింది. వీరబుద్ధి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుంటూ ఉండిపోయింది. ‘మన అడవిని కాపాడుకోడానికి మనం యుద్ధానికి సిద్ధం అయితే ఎలా ఉంటుంది ?’ అని అడిగింది సింహం. 
‘భేషుగ్గా ఉంటుంది మహారాజా.. యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పేవాడు మా తాత’ అన్నది వీరబుద్ధి. సింహం కాసేపు అటూ ఇటూ తిరిగి ‘కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం తప్పదు.

పోనీ మనం వాళ్ళతో సంధి కుదుర్చుకొతువులుని ఆ అడవిలోని జనం కూడా స్వేచ్ఛగా మన అడవిలో తిరుగుతూ, చెలమల్లో నీళ్ళు తాగడానికి అనుమతిస్తే ఎలా ఉంటుంది?’ అని అడిగింది సింహం. ‘ఈ ఆలోచన బాగుంది. అవి మన అడవిలో తిరిగితే మనకు నష్టం ఏమీ ఉండదు’ అన్నది వీరబుద్ధి. ‘అప్పుడు మనం స్వతంత్రం కోల్పోయినట్లే! అలాకాదు.. ఇంకా వాళ్ళు దండయాత్ర  చేసే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ముందు మనమే వాళ్ళ మీదకు దండయాత్ర చేస్తే? ఇంకా పూర్తిగా సిద్ధంగా లేని వాళ్ళను ఒడించవచ్చు కదా?’ అంది సింహం. ‘అవునవును.. మనం అలాగే చేయాలి. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది’ అన్నది వీరబుద్ధి. ‘సరే.. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నను తీసుకుని రా’ అని పురమాయించింది సింహం. 

వీరబుద్ధి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రి సుబుద్ధితో తిరిగి వచ్చింది. అప్పటికి సింహం ఇంకా గుహ బయటే పచార్లు చేస్తోంది. అది పాత సలహాదారును చూస్తూనే.. ‘చూడు సుబుద్ధీ.. వంశపారంపర్యంగా చేసుకునేందుకు సలహాదారు ఉద్యోగమేమీ వ్యవసాయం కాదు. ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి.. సమస్యను సరిగ్గా అర్థం చేసుకునే తెలివి వంటి లక్షణాలు అన్నీ ఉండాలి. నీ కొడుకుకి సమస్య మనమే వివరించి.. దానికి పరిష్కారమూ మనమే అందించాలి. మనమేం చెబితే దానికి తలాడించే వాడు సలహాదారుడు కాలేడు. వాడు చురుగ్గా తిరగ్గలడు. అందుకు తగిన ఉద్యోగం చూస్తానులే’ అన్నది సింహం. ‘అలాగే మహారాజా, నాది కూడా ఒక విన్నపం. నాకు వయసు మీద పడి చురుకు తగ్గినా.. ఆలోచన శక్తి మాత్రం తగ్గలేదు.

సలహాదారు ఉద్యోగానికి బుద్ధితో తప్ప వయసుతో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే వయసుతో తెలివి, అనుభవం పెరుగుతాయి. మరోసారి నా విషయం ఆలోచించండి’ అన్నది సుబుద్ధి వినయంగా. సింహం తల పంకించి కొత్తగా వచ్చిన సమస్యను వివరించి ‘ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు’ అని అడిగింది. సుబుద్ధి కాసేపు ఆలోచించి ‘నా సలహా మీకు కోపం తెప్పించే విధంగానే ఉంటుంది. మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

భైరవకోన యువరాణికి ఒక కన్ను లేదు. ఆమె పెళ్ళి చేయలేకపోతున్నానన్న దిగులు ఆ రాజుగారిని పట్టి పీడిస్తోంది. మీరు పెద్ద మనసు చేసుకుని మన యువరాజుకు భైరవకోన యువరాణితో పెళ్ళి జరిపిస్తానని కబురు పంపితే రాబోయే ఈ కయ్యం కాస్తా వియ్యంగా మారుతుంది. ఈ అడివి కోసం మీ రాజ కుటుంబం త్యాగం చేయకతప్పదు. అలా జరిగిననాడు మన యువరాజు ఈ రెండు అడవులకు చక్రవర్తి అవుతాడు’ అన్నది.‘భేష్‌.. సుబుద్ధి తెలివితేటలకు, ఆలోచన శక్తికి వయసుతో పనిలేదని నిరూపించావు. నీ సలహా ప్రకారమే చేస్తాను. రేపటి నుంచి కొలువులోకి వచ్చేయ్‌’ అంది సింహం సంతోషంగా! 

(చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!)
 

Advertisement
 
Advertisement