
నాకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. ఒక పాప..16 ఏళ్లు. బాబు..14 ఏళ్లు. పెళ్లి నాటికి నాకు ఇరవై ఏళ్లు. నా భార్యకు పదహారేళ్లు. గత కొన్నేళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేర రాసివ్వాలని, లేకపోతే తన మైనార్టీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకుని, బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు? – శ్రీహరి, కర్నూలు
బాల్యవివాహాల నిరోధక చట్టం, 2006 ప్రకారం ఒక మేజర్ పురుషుడు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న పురుషుడికి అలాగే ఆ పెళ్లి జరిపించిన పెద్దలకు, ఆ పెళ్లి జరగాలని ్ర΄ోత్సహించిన వారికి కూడా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లక్ష రూ΄ాయల వరకు జరిమానా ఉంది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి పురుషులకైతే చట్టబద్ధమైన వయసు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారమైనా, బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారమైనా.. బాల్య వివాహం జరిగితే సదరు అమ్మాయి తనకు ఇరవై ఏళ్లు నిండేలోపు కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఒక ప్రతినిధి ద్వారా, మిత్రుల సహాయంతో, బాల్యవివాహాల నిరోధక అధికారి ద్వారా కూడా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?
20 ఏళ్లు నిండిన తర్వాత వివాహ రద్దుకు ప్రస్తుత చట్టం అంగీకరించదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వైవాహిక సంబంధం కొనసాగించిందని చట్టం భావిస్తుంది. ఇరవై ఏళ్ల వైవాహిక బంధం, సంతానం కూడా కలిగిన తర్వాత మీపై పోక్సో కేసు వేసే ఆస్కారం లేదు! వివాహం కాకుండా ఉండి ఉంటే అది వేరే సంగతి! బలవంతపు పెళ్లి చేశారనే ఆస్కారం కూడా లేదిప్పుడు. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం కూడా బలవంతపు పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో వైవాహిక సంబంధం కొనసాగిస్తే ఆ బలవంతం/మోసపూరితమైన అంగీకారం అనే కారణాలపై వివాహాన్ని రద్దు చేయడం కుదరదు. మీరిద్దరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్‌ని కలవండి. సమస్యలు పరిష్కారం కాకపోతే సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి. లాయర్‌ను సంప్రదించి మీకున్న అవకాశాలు, హక్కులను తెలుసుకోవడం కూడా మంచిదే!
– శ్రీకాంత్ చింతల,
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.