
మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు. తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.
– విజయ, హైదరాబాద్
మీ మేనకోడలు ఒక మేజర్. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది.
బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి.
కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్ ఇప్పించండి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)
(చదవండి: యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్)