స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీ అంటూ ఫోన్ చేసిన వారిని నమ్మి ఒక వాట్సాప్ గ్రూపులో చేరాను. కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాను. మొదట్లో ఆరు లక్షల దాకా లాభం వచ్చింది అని దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ రోజు ఒక్కసారిగా నా ఎకౌంట్లో నుంచి 8 లక్షల రూపాయలు కట్ అవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కోర్టు ఆర్డర్ ద్వారా డబ్బులు వేరే అకౌంట్ కి పంపించేశారని, నా అకౌంట్‌ను కూడా ఫ్రీజ్ చేశారనీ తెలిసింది.
కోర్టు ఆర్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. బ్యాంక్ వారిని అడిగితే పరిష్కారం కోసం తమిళనాడు కోర్టుకు, కర్ణాటక కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. నా అకౌంట్లో ఇంకా 20 లక్షలు ఉన్నాయి కానీ కేసుల వల్ల అవి కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. తీరా చూస్తే నేను పెట్టుబడి పెట్టిన దానికంటే పోయిందే ఎక్కువ. దయచేసి నాకు పరిష్కారం సూచించగలరు.
– నళిని, హైదరాబాద్
అనేక రకాల సైబర్ నేరాల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ కూడా ఒకటి. స్నేహం పేరుతో ప్రలోభ పెట్టి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ట్రేడింగ్ చేయాలని అనుకుంటే నమ్మకమైన కంపెనీల ద్వారా మాత్రమే చేయాలి తప్ప, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ గ్రూపులలో ప్రకటనలు చూసి చేయడం అనేకమందిని బాధితులను చేస్తున్నాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీరు నేరం చేయనప్పటికీ, మీరు ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసి సంపాదించాను అనుకునే నగదు బహుశా సైబర్ నేరగాళ్లు చేసిన లావాదేవీలలో భాగం అయి ఉండవచ్చు.
మరొకరి దగ్గర అక్రమంగా తీసుకున్న డబ్బులను కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ మాయలో పడిన వారికి లాభంగా చూపిస్తూ వారి ఎకౌంట్లో వేసి వారి నమ్మకాన్ని సాధిస్తారు. తర్వాత మీరు ఎక్కువ లాభాల కోసం ఎక్కువ నగదు ఇవ్వాలి అనేదే వారి ఎత్తుగడ. కాబట్టి మీ అకౌంట్లోకి వచ్చిన మొత్తం లాభంగా మీరు భావిస్తున్నది అయినప్పటికీ, అది మరొక బాధితుడి డబ్బు అయి ఉండే ఆస్కారం ఉంది. అయితే నిజానిజాలు నిర్ణయించవలసినది కోర్టు!
ఇకపోతే, మీ ఎకౌంటు ఫ్రీజ్ అయింది అని చె΄్పారు కాబట్టి, ఆర్డరు ఇచ్చిన కోర్టును లేదా ఏ పరిధిలోని పోలీసులు అకౌంట్ ఫ్రీజ్ చేశారో తెలుసుకొని వారిని సంప్రదించవలసి ఉంటుంది. వేరే రాష్ట్రాల కోర్టుకు వెళ్లడం లేదా అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి మీ ఎకౌంటులో ఉన్న నగదును కూడా కాడుకోవడం మాత్రమే మీకు ఉండే దారి. అదనంగా మీరు కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వారికి ఒక ఫిర్యాదు చేస్తే మంచిది.
మిమ్మల్ని ఏ విధంగా ట్రేడింగ్ కంపెనీ వారు సంప్రదించారు, ఏ విధంగా ఏ అకౌంట్లోకి మీరు డబ్బులు జమ చేశారు వంటి పూర్తి వివరాలను సైబర్ క్రైౖమ్ డిపార్ట్‌మెంట్ వారికి వెల్లడించి ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. మీకు వచ్చినది ఎంత...? పోయినది ఎంత అనే విషయాన్ని రుజువులతో సహా ఇవ్వండి. మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి అంటే అది పోలీసు వారు మాత్రమే చేయగలరు. అదీ విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే రికవరీ చేయగలరు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మీ అకౌంట్‌లో లావాదేవీలు చేయడానికి మీ అనుమతి అవసరం లేదు!
శ్రీకాంత్ చింతల
(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )


