హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ – పిల్) కేసు వేయాలి అంటే ఎలాంటి సందర్భాలలో వేయొచ్చు?
– చంద్రహాస్, విజయవాడ
సమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై, అక్రమాలపై, ప్రభుత్వానికి – ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి అంశాలపై ప్రతి ఒక్క పౌరుడూ హైకోర్టును అలాగే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగలిగే హక్కు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా కల్పించింది అత్యున్నత న్యాయస్థానం.
ఐతే ఏ విషయాన్ని పిల్ వేయాలి అనే అవగాహన ఉండాలి. లేకపోతే కోర్టు జరిమానా వేసే ఆస్కారం కూడా ఉంటుంది. సాధారణ కేసులలో అయితే మీకు, మీరు వేసిన వ్యాజ్యానికి సంబంధం ఏమిటో కోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పక్షంలో మీ కేసును కోర్టు పరిగణించవలసిన అవసరం లేదు. కానీ మీకు నేరుగా వ్యక్తిగత సంబంధం – లబ్ధి లేని అంశాలపై – సమాజానికి/ప్రజా ప్రయోజనం ఉన్నది అని చూపించగలిగిన అంశాలపై పిల్ దాఖలు చేయవచ్చు. మీకు నేరుగా ఎటువంటి లబ్ధి లేదు అని కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించవలసి ఉంటుంది.
అంతేకాక కేసు దాఖలు చేసే ముందు మీరు పూర్తిగా అధ్యయనం చేశారు అని, ఎలాంటి పరిణామాల మధ్య మీరు ఆ కేసు వేయవలసిన అవసరం వచ్చిందో వివరించాలి. అలాగే కేసుకు అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నట్లు చెప్తూ మీ పాన్ కార్డు కూడా సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటి వెనుక గల ఉద్దేశం: వ్యక్తిగత కారణాలవల్ల కాకుండా నిజమైన ప్రజాప్రయోజనం కోసం మాత్రమే మీరు కోర్టును ఆశ్రయించారు అని కోర్టు పరిశీలిస్తుంది.
పనిచేసే ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 రావడానికి కారణమైన ‘విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’, రోడ్డు ప్రమాదాలు / ప్రాణాపాయం వంటి అత్యవసర సమయాలలో ΄ోలీసు వారికోసం వేచి చూడకుండా హాస్పిటల్ వారు చికిత్స అందించాలి అని చెప్పిన ‘పరమానంద కట్టారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ వంటి ఎన్నో కేసులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వచ్చినవే! ఇది మనకు రాజ్యాంగం – సుప్రీం కోర్టు కల్పించిన ఒక బలమైన హక్కు.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీ కున్న సమస్యల కోసం sakshifamily3@gmail.com మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం కు మెయిల్ చేయవచ్చు. )


