జీవన సూత్రం | Human life thrives when guided by compassion and harmony with nature | Sakshi
Sakshi News home page

జీవన సూత్రం

Jul 13 2026 5:59 AM | Updated on Jul 13 2026 5:59 AM

Human life thrives when guided by compassion and harmony with nature

మంచిమాట

జీవితం అంటే మనం భయపడే భవిష్యత్తులో లేదు, గడిచిపోయిన గతంలో లేదు. అది కేవలం ఈ ‘ప్రస్తుత క్షణం’ లో మాత్రమే ఉంది.  ఇలాంటివి మనకి జీవితంలో ఎన్నోకనిపిస్తాయి. నిష్కామ కర్మ, వర్తమానంలో జీవించడం అనేవి పుస్తకాల్లో చదువుకునే పదాలు కావు. ఆచరణలో పెట్టాల్సిన ‘జీవన సూత్రాలు’. 

మానవ జన్మ అత్యంత అరుదైనది, విశిష్టమైనది. పుట్టడం, పెరగడం, కనుమరుగవ్వడం అనే సహజ చక్రంలో కొట్టుకుపోవడం మాత్రమే జీవితం కాదు. ప్రతి మనిషి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని గ్రహించి, ఆచరించడమే అసలైన జీవన సూత్రం. ఆధ్యాత్మిక దష్టితో చూసినప్పుడు, జీవితం అనేది ఒక పరీక్ష కాదు, అది నిరంతరం సాగే ఒక పవిత్రమైన ప్రయాణం. బాహ్య ప్రపంచపు ఆకర్షణల నుండి విడివడి, అంతరంగపు లోతుల్లోకి ప్రవహించే ప్రశాంతతే ఆధ్యాత్మికత. 

మనిషి తన ఆనందాన్ని బయటి వస్తువులలో, వ్యక్తులలో, పరిస్థితులలో వెతుకుతుంటాడు. కానీ, ’శాంతి అనేది మన లోపలే ఉంది’ అని తెలుసుకోవడం. మనసుని బాహ్య ప్రపంచం నుండి లోపలికి మళ్లించడాన్నే ధ్యానం అంటారు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అత్యంత ప్రాథమిక జీవన సూత్రం. మనం చేసే ప్రతి పనిని ఒక బాధ్యతగా, దైవకార్యంగా భావించి చేయాలి. ఫలితం గురించి అతిగా ఆలోచించడం వల్లే ఆందోళన, భయం పుడతాయి. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే పనే మనసుకు అనంతమైన స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. 

ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకుని అడవుల్లో కూర్చోవడం కాదు. సాటి మనుషుల పట్ల, జీవకోటి పట్ల కరుణ కలిగి ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత. ఒకరి కష్టాన్ని చూసి చలించే హృదయం, సహాయం చేయడానికి ముందుకొచ్చే స్వభావం మాననీయతకు నిదర్శనం. విశాల దృక్పథంతో వ్యవహరించినప్పుడే మనిషిలోని దైవత్వం జాగృతమవుతుంది. వినమ్రత అనేది ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించడానికి కావలసిన తొలి మెట్టు. 

మనకు లేని వాటి గురించి చింతించడం కన్నా, ఉన్నవాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రకృతికి, పంచభూతాలకు, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు, సృష్టికర్తకు ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా మనలో అనుకూల శక్తి వృద్ధి చెందుతుంది. అంచనాలు లేని ప్రేమ, ఫలాపేక్ష లేని కర్మ, స్వార్థం లేని సేవ – ఇవే ఒక సాధారణ మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతికి నడిపిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిరునవ్వును కోల్పోకుండా, నిశ్చలమైన మనసుతో జీవితాన్ని సాగించడమే సృష్టిలో అతిపెద్ద సాఫల్యం.

గడిచిన నిమిషం తిరిగి రాదు, రేపటి గురించి మనకు ఎలాంటి భరోసా లేదు. మన చేతుల్లో ఉన్న ఏకైక సత్యం ‘ప్రస్తుత క్షణం’. గతాన్ని తలచుకుని భవిష్యత్తు గురించి భయపడటం మానేసి, ఈ క్షణంలో సంపూర్ణంగా జీవించడం నేర్చుకోవాలి. సమయాన్ని వృథా చేయకుండా, ప్రతి క్షణాన్ని ఆత్మ వికాసానికి ఉపయోగించుకోవడం ఒక గొప్ప యోగం.

వేణు మనసంతా ఏదో తెలియని అలజడి. వృత్తిపరంగా ఎంతో సాధించినా, భవిష్యత్తులో  ఎదగాలనే ఆరాటం, రేపు ఏమవుతుందో అనే ఆందోళన అతన్ని నిలకడగా ఉండనివ్వడం లేదు. ఎప్పుడూ తన ఆలోచనల్లో చిక్కుకుని, ఏదో కోల్పోయిన వాడిలా గడిపేస్తున్నాడు. అతని మానసిక సంఘర్షణను నిశ్శబ్దంగా గమనిస్తోంది నీలిమ. ఒక సాయంత్రం వేణుని బలవంతంగా బయటకు తీసుకెళ్లింది. ఇద్దరూ పార్కువైపు నడుస్తున్నారు. చల్లటి గాలి వీస్తున్నా, వేణు చికాగ్గా ఉన్నాడు. ఇంతలో దారి పక్కన ఒక వృద్ధుడు తన తోపుడు బండి చక్రం బురద గుంతలో ఇరుక్కుపోతే, దాన్ని బయటకు తీయలేక అవస్థలు పడుతున్నాడు. 

చుట్టూ జనం వారి పనుల్లో వారు హడావిడిగా వెళ్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. వేణు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి, అప్రయత్నంగానే అటు వైపు వెళ్లాడు. తన బట్టలు పాడవుతాయన్న స్పృహ కూడా లేకుండా వంగి, ఆ వృద్ధుడికి సాయం చేసి బండిని గుంతలోంచి బయటకు తీశాడు. ఆ వృద్ధుడు కృతజ్ఞతగా రెండు చేతులు జోడించి చిరునవ్వు చిందించాడు. ఆ అమాయకమైన నవ్వు చూడగానే, ఉదయం నుంచి వేణు మెదడులో ఉన్న ఒత్తిడి అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. మనసులో మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత ఆవరించింది. ఎప్పుడు దొరకని శాంతి ’ఈ క్షణంలో’ ఒకరికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసినప్పుడు దొరికింది. మాననీయత చూపిన ఈ చిన్న పని అతనిలోని మనిషిని నిద్రలేపింది.
 
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement