
ఓడించడానికి వరద వస్తుంది. మనిషిని ఓడగొట్టి చూద్దామని వరద వస్తుంది. వేయి చేతులతో లక్ష కాళ్లతో రాత్రికి రాత్రి... చీకటి దారిలో... దొంగదెబ్బ తీద్దామని వరద వస్తుంది. పగటి వేళ బందిపోటులా నీటితూటాల తుపాకీ పేలుస్తూ వరద వస్తుంది. అది ఇంటి పాదాల కిందుగా వస్తుంది. ఇంటి యజమాని తల మీదుగా వస్తుంది.
చావిట్లోని ఎడ్ల కొమ్ముల మీద నుంచి, బరెగొడ్ల పొదుగుల మీద నుంచి, చంటి పిల్లల బెదురు ఏడుపుల మీద నుంచి, అమ్మ వెలిగించాల్సిన పొయ్యి మీద నుంచి, నాన్న జేబు మీద నుంచి భీతావహం చేస్తూ బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. నేనెక్కువ అని ప్రకటించడానికి వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, కూలగొడుతూ, పెళ్లగిస్తూ, కుళ్లగిస్తూ ప్రతాపం చూపించడానికి వస్తుంది.
ఈ దెబ్బతో మనిషి సఫా– అనుకుంటుంది అది. విర్రవీగుతుంది అది. ఉధృతంగా నవ్వుతుంది అది. అప్పటికి మనిషి సిద్ధమైపోయి ఉంటాడు. సరే... కొన్నాళ్లు అని నిర్ణయం తీసుకుని ఉంటాడు. భార్యాబిడ్డలను ఒడ్డుకు బయల్దేరదీస్తూ ఉంటాడు. మిగిలిన నూకలను మూటగట్టుకుంటూ ఉంటాడు. గొడ్డూ గోదాను తీసుకెళ్లేందుకు బల్లకట్టును వెతుకుతూ ఉంటాడు.
మధ్య మధ్య భార్యను కేకేసి ‘ఇంటి ముందుకు నీళ్ల పిశాచి వచ్చింది... దానిక్కాస్త చీపురు చూపించు’ అని పురమాయిస్తుంటాడు. ఎన్ని చూసి ఉంటాడతడు? తుఫాన్లు కొత్తా? కుంభవృష్టి కొత్తా? వడగండ్లు కొత్తా? వడగాడ్పులు కొత్తా? కరువు కొత్తా? బతుకు నెత్తిన పడేసే బరువు కొత్తా? రోగాలు.. రొష్టులు.. మహమ్మారులు.... పాలకుల నమ్మకద్రోహాలు... వ్యాపారుల నిలువు దోపిడీలు... డబ్బు రాజేసే పెను మంటలు... వరదకు భయపడతాడా?
మనిషి ఆగడు. జీవితాన్ని ఆగనివ్వడు. ఆశను చావనివ్వడు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. నాలుగు రోజులు ఉండి వెళ్లే అతిథికి తగిన మర్యాదలు చేసి పంపడం అతనికి వచ్చు. కష్టాలను మెల్లగా సాగనంపడం వచ్చు. వాటిని వదిలిపెట్టడం వదుల్చుకోవడం వచ్చు. అందుకు సాటి మనిషిని తోడు చేసుకోవడమూ వచ్చు. ఇది తెలియని వరద అతడిని జయించాలని చూసినప్పుడల్లా ఓడిపోయింది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంది.
మహా అయితే సాధించగలిగేది కాసింత బురద జల్లి పోవడమే. మనిషి సాగించే అనంత జీవన ప్రయాణంలో వరదది లిప్తపాటు కలకలం. అతడు రేపో మర్నాడో మళ్లీ తన ఇల్లు చేరుతాడు. ఆరబెట్టిన వస్తువులు లోపల పెట్టుకుంటాడు. తల స్నానం చేసి, పొడి బట్టలు కట్టుకుని, భార్య వండిన వేడి వేడి భోజనాన్ని పిల్లలతో పాటు భుజిస్తూ ఆశను ఊత చేసి సాగిపోతూనే ఉంటాడు.