breaking news
life of man
-
ఆశల బల్లకట్టు
ఓడించడానికి వరద వస్తుంది. మనిషిని ఓడగొట్టి చూద్దామని వరద వస్తుంది. వేయి చేతులతో లక్ష కాళ్లతో రాత్రికి రాత్రి... చీకటి దారిలో... దొంగదెబ్బ తీద్దామని వరద వస్తుంది. పగటి వేళ బందిపోటులా నీటితూటాల తుపాకీ పేలుస్తూ వరద వస్తుంది. అది ఇంటి పాదాల కిందుగా వస్తుంది. ఇంటి యజమాని తల మీదుగా వస్తుంది. చావిట్లోని ఎడ్ల కొమ్ముల మీద నుంచి, బరెగొడ్ల పొదుగుల మీద నుంచి, చంటి పిల్లల బెదురు ఏడుపుల మీద నుంచి, అమ్మ వెలిగించాల్సిన పొయ్యి మీద నుంచి, నాన్న జేబు మీద నుంచి భీతావహం చేస్తూ బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. నేనెక్కువ అని ప్రకటించడానికి వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, కూలగొడుతూ, పెళ్లగిస్తూ, కుళ్లగిస్తూ ప్రతాపం చూపించడానికి వస్తుంది.ఈ దెబ్బతో మనిషి సఫా– అనుకుంటుంది అది. విర్రవీగుతుంది అది. ఉధృతంగా నవ్వుతుంది అది. అప్పటికి మనిషి సిద్ధమైపోయి ఉంటాడు. సరే... కొన్నాళ్లు అని నిర్ణయం తీసుకుని ఉంటాడు. భార్యాబిడ్డలను ఒడ్డుకు బయల్దేరదీస్తూ ఉంటాడు. మిగిలిన నూకలను మూటగట్టుకుంటూ ఉంటాడు. గొడ్డూ గోదాను తీసుకెళ్లేందుకు బల్లకట్టును వెతుకుతూ ఉంటాడు. మధ్య మధ్య భార్యను కేకేసి ‘ఇంటి ముందుకు నీళ్ల పిశాచి వచ్చింది... దానిక్కాస్త చీపురు చూపించు’ అని పురమాయిస్తుంటాడు. ఎన్ని చూసి ఉంటాడతడు? తుఫాన్లు కొత్తా? కుంభవృష్టి కొత్తా? వడగండ్లు కొత్తా? వడగాడ్పులు కొత్తా? కరువు కొత్తా? బతుకు నెత్తిన పడేసే బరువు కొత్తా? రోగాలు.. రొష్టులు.. మహమ్మారులు.... పాలకుల నమ్మకద్రోహాలు... వ్యాపారుల నిలువు దోపిడీలు... డబ్బు రాజేసే పెను మంటలు... వరదకు భయపడతాడా? మనిషి ఆగడు. జీవితాన్ని ఆగనివ్వడు. ఆశను చావనివ్వడు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. నాలుగు రోజులు ఉండి వెళ్లే అతిథికి తగిన మర్యాదలు చేసి పంపడం అతనికి వచ్చు. కష్టాలను మెల్లగా సాగనంపడం వచ్చు. వాటిని వదిలిపెట్టడం వదుల్చుకోవడం వచ్చు. అందుకు సాటి మనిషిని తోడు చేసుకోవడమూ వచ్చు. ఇది తెలియని వరద అతడిని జయించాలని చూసినప్పుడల్లా ఓడిపోయింది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంది. మహా అయితే సాధించగలిగేది కాసింత బురద జల్లి పోవడమే. మనిషి సాగించే అనంత జీవన ప్రయాణంలో వరదది లిప్తపాటు కలకలం. అతడు రేపో మర్నాడో మళ్లీ తన ఇల్లు చేరుతాడు. ఆరబెట్టిన వస్తువులు లోపల పెట్టుకుంటాడు. తల స్నానం చేసి, పొడి బట్టలు కట్టుకుని, భార్య వండిన వేడి వేడి భోజనాన్ని పిల్లలతో పాటు భుజిస్తూ ఆశను ఊత చేసి సాగిపోతూనే ఉంటాడు. -
నిత్యనూతన గీతం
మనిషి జీవితంలో ‘యుద్ధం’ అనివార్యం. అవసరాల కోసం... అవకాశాల కోసం... గుర్తింపు కోసం... బంధాల రక్షణ కోసం... బాధ్యతల నిర్వహణ కోసం... సమరం సాగించాల్సిందే. ఇలా మనిషి జీవితం నిత్య కురుక్షేత్రం. సరిగ్గా ఇలాంటి యుద్ధంలోనే భగవద్గీత ఉద్భవించింది! అర్జున విషాదయోగంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. శత్రుసైన్యంలో అందరూ తనవారే ఉండేసరికి నైరాశ్యానికి గురై, యుద్ధానికి ముందే ఓటమి వైపు అడుగేస్తుంటాడు అర్జునుడు. అతని అంతరంగంలో ఆలోచనల అంతర్యుద్ధం మొదలైంది. ఏం చేయాలో దిక్కు తోచక ‘నువ్వే నాకు దిక్కు’ అంటూ భగవానుడిని ఆశ్రయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు. భగవద్గీతలోని రెండో అధ్యాయం సాంఖ్య యోగం నుంచి భగవానుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నాడు-నేడు-కృష్ణుడు ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥ ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ భగవానుడు బోధిస్తాడు. ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనోదౌర్బల్యం. దాన్ని విడిచిపెడితే విజయమే. ‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం’ యుద్ధం ఓ సదవకాశం అంటాడు భగవానుడు. యుద్ధం జరిగితేనే కదా ఎవరి బలాబలాలు ఏంటో బయటపడేది. యువతకి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి! ‘క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి’ కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం అంటాడు భగవానుడు. ఇది తెలిస్తే చాలు... వేరే యాంగర్ మేనేజ్మెంట్ అంటూ ఇంకేం ఉంటుంది! ‘సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః’ ఏ విషయం మీదా ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటివాడిగానే తయారవుతాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. ఆకళింపు చేసుకునే ఆసక్తితో ప్రయత్నం చేయాలేగానీ అర్జున విషాదయోగం మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకూ... గీతలోని పద్ధెనిమిది అధ్యాయాల్లో ఇలాంటి మేలిముత్యాలెన్నో. అందుకే భగవద్గీతకు మించిన వ్యక్తిత్వ వికాసం ఇంకోటి లేదు. ఇంతకు మించిన లీడర్ షిప్ పాఠమూ మరొకటి లేదు. దీనికంటే గొప్ప వాగ్ధాటిని, జీవన పోరాటాన్ని నేర్పించగలిగే గ్రంథమూ లేదు. ఇదీ అదీ అని కాదు... నేటి యువతరం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం భగవద్గీతలో ఉంది. ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయడం... ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటం ఇది నేర్పుతుంది. - బి.వి.సురేష్బాబా నేటి ‘అర్జునులు’! ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో నేటి యువతరంలోని ఎంతోమందిదీ అదే స్థితి! అదే అయోమయం. అదే ఊగిసలాట. చాలామందికి ఉన్నత లక్ష్యాలు ఉంటాయి. వాటి సాధనకు ప్రయత్నాలూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నంలో వైఫల్యాలు ఎదురైతేనే నిరాశానిసృ్పహలతో కుంగిపోవడం, ఓటమికి తల వంచేయడం. ‘ఇక దేని కోసం జీవించాలి? బతికుండి ఏం ప్రయోజనం?’అనే మెట్ట వేదాంత ధోరణి! ‘యుద్ధం చేయడం కర్తవ్యం’ అన్నది మరచిపోతారు. ఇక్కడ ‘యుద్ధం‘ అంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా జీవన పోరాటాన్ని కొనసాగించడం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని పోగు చేసుకుని పోరాడటం. ఈ తరం యువతకి కావాల్సిన బలం, బలగం ఇదే. గీతాచార్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఇచ్చిన భరోసా కూడా ఇదే.