ప్రాప్తం | explanation of praptam in lifestyle | Sakshi
Sakshi News home page

ప్రాప్తం

Jul 13 2026 6:07 AM | Updated on Jul 13 2026 6:07 AM

explanation of praptam in lifestyle

తాత్త్వికథ

‘‘ప్రతి బియ్యపు గింజ మీదా ఒకరి పేరు రాసి ఉంటుంది. దాన్ని తినే ప్రాప్తం ఉన్న వారికే అది దక్కుతుంది’’ అని ఊర్లోని ఓ పెద్దాయన అందరికీ చెప్పేవాడు. మంచి జీవితానుభవం ఉన్న ఆ ఊరి పెద్ద అలా చెప్పిన ప్రతిసారీ ఓ రైతు ఒప్పుకునే వాడు కాదు. అలా ఎలా అవుతుందని గట్టిగా వాదించే వాడు. ఇదిలా ఉండగా..
ఊర్లో ఒకరోజు వినాయకుని గుడి దగ్గర పెళ్లి జరుగుతోంది. ఆ విందుకు ఊర్లో వాళ్ళందరూ హాజరయ్యారు. పెళ్ళికి హాజరైన రైతు విస్తరిలో వడ్డించిన వేటినీ వృథా చేయకుండా కడుపునిండా తిన్నాడు. విస్తరిలో పెళ్ళి వారు పెట్టిన అరటిపండు చేతిలో పెట్టుకుని బయటికి వచ్చాడు. ఆ రైతుకు పెళ్ళికి వచ్చిన ఊరి పెద్ద ఎదురయ్యాడు.

‘‘ఈ అరటి పండు పెళ్ళి వారు ఇచ్చారు, నేను తింటున్నాను. దీన్ని ప్రాప్తమని చెబితే ఎలా? నా చేతిలోని అరటి పండు నాది కాకుండా పోతుందా? ఇది నూటికి నూరు పాళ్ళు నాకే సొంతం కదా’’ అని ఆవేశంగా అన్నాడు. ‘ఎవరికి ఏది ప్రాప్తమో అది తప్పక వారి చేతికి చేరి తీరుతుంది’ అని ఊరి పెద్ద సర్ది చెప్పబోయాడు. ఇంతలో రైతు భార్య గుడి నుంచి బయటికి వచ్చింది. ఆమె చంకన నాలుగేళ్ళ ముద్దుల మనవడు ఉన్నాడు. వాడు తాత చేతిలోని అరటి పండును కొద్దిసేపు కన్నార్పకుండా చూశాడు. చేతి వేలు చూపిస్తూ ఆ అరటిపండు కావాలని అడిగాడు.

ఆ రైతు దబాయింపు ధోరణిలో ‘‘ఇది నాది, నీకు కావాల్సి ఉంటే వేరే పండు ఇప్పిస్తాను. ఇక్కడ అరటిపళ్లు దండిగా ఉన్నాయి’’ అని చెప్పాడు. మనవడిని తీసుకెళ్ళి పెళ్ళి వారు పక్కన పెట్టి ఉన్న గెలలను చూపాడు. వాడు అవేవీ వద్దని, తాత చేతిలోని అరటిపండే కావాలని గట్టిగా ఏడుస్తూ నేల మీద పడి దొర్లడం ప్రారంభించాడు.

అన్ని పండ్లూ ఒకటేనని అవ్వాతాతా ఎంత సముదాయించినా వాడు వినలేదు, మరింత గట్టిగా ఏడుస్తూ వొంటినున్న చొక్కాను చింపుకోబోయాడు. చేసేదేమీ లేక రైతు తన చేతిలోని అరటి పండును మనవడి చేతికి ఇచ్చాడు. వాడు దాన్ని గబగబా తినేసి తాత చేతికి తొక్కనిచ్చాడు. జరిగిన తంతు చూసి ముసిముసిగా నవ్వుతూ పెళ్ళి జరిగే చోటికి వెళ్ళాడు ఊరి పెద్ద. చేతిలోని తొక్కను దూరంగా విసిరేస్తూ ‘దేనికైనా ప్రాప్తముండాలి’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రైతు.    

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement