‘సైలెంట్‌ కిల్లర్‌’తో జాగ్రత్త.. భారత్‌లో 30 శాతం మంది బాధితులు

Lancet Journal Found 30 Percent People Suffer From High Blood Pressure - Sakshi

30 శాతం భారతీయుల్లో అధిక రక్తపోటు

అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య నిపుణులు ‘సైలెంట్‌ కిల్లర్‌’గా పరిగణిస్తున్న ‘హైపర్‌ టెన్షన్‌’ (బీపీ) అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలోని 30 శాతం మంది ‘అధిక రక్తపోటు’తో బాధపడుతున్నారని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 వరకు 184 దేశాల్లో 10 కోట్ల మందిపై నిర్వహించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు విశ్లేషించిన సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్న అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంపీరియల్‌ కాలేజీ ఆఫ్‌ లండన్, భారత్‌లోని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్‌ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది.
చదవండి: పండగలప్పుడు జరభద్రం!

ప్రపంచస్థాయిలో 1990తో పోల్చితే 2019కల్లా బీపీ సమస్యల విషయంలో మహిళలు, పురుషుల సంఖ్య రెట్టింపైనట్లు వెల్లడైంది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్‌ ఫెయిల్యూర్స్‌ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. బీపీతో ముడిపడిన అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ‘సాక్షి’తో క్రిటికల్‌ కేర్‌ నిపుణుడు డాక్టర్‌  ఎ.నవీన్‌రెడ్డి, కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్రభుకుమార్‌ చల్లగాలి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...

మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే..
గతంలో 50–60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25–30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది.

చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. జీవనశైలి పద్ధతులను మార్చుకోకుండా బీపీని నియంత్రించలేం. బీపీకి నడక చాలా మంచి మందు. 90 శాతం వరకు కారణాలు లేకుండానే బీపీ వస్తుంది. దీనినే ‘ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌’ అని పిలుస్తాం.    
– డా. ఎ.నవీన్‌రెడ్డి, క్రిటికల్‌కేర్‌ నిపుణుడు,నవీన్‌రెడ్డి హాస్పిటల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top