పండగలప్పుడు జరభద్రం! | Covid second wave not over yet, celebrate festivals with caution | Sakshi
Sakshi News home page

పండగలప్పుడు జరభద్రం!

Aug 27 2021 6:20 AM | Updated on Aug 27 2021 6:20 AM

Covid second wave not over yet, celebrate festivals with caution - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో అప్రమత్తత అవసరమనీ, రాబోయే పండుగలను కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ జరుపుకోవాలని కోరింది. కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ మధ్యలోనే ఉందన్నారు. పండగల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 41 జిల్లాల్లో కోవిడ్‌ వీక్లీ పాజిటివ్‌ రేటు 10% కంటే ఎక్కువగానూ, 27 జిల్లాల్లో 5–10 శాతాల మధ్యలోనూ నమోదవుతోందని వివరించారు.

జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు భారీగా పెరుగుతాయన్నారు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని నివారించడం చాలా ముఖ్యమని వివరించారు. ఒక్క కేరళలోనే లక్ష యాక్టివ్‌ కేసులున్నాయనీ, మొత్తం యాక్టివ్‌ కేసుల్లో ఇవి 51.19% అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో యాక్టివ్‌ కేసులు 10 వేల నుంచి 1లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్‌ రేటు కూడా జూలైలో 43.41 లక్షలుండగా ఆగస్టులో అది 52.16 లక్షల డోసులకు పెరిగిందన్నారు.

దేశంలో గత రెండు, మూడు వారాలుగా ఏ రాష్ట్రం నుంచి కూడా కోవిడ్‌ టీకా కొరత ఉందంటూ ఫిర్యాదులు అందలేదని భూషణ్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపయోగించని/ నిల్వ ఉన్న టీకా డోసులు 2.5 కోట్లకు తగ్గలేదని తెలిపారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 లక్షల డోసుల టీకా వేసినట్లు తమకు వివరాలందాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్‌ లభ్యత సంతృప్తికరంగా ఉందని వివరించారు. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 50 శాతం మందికి కోవిడ్‌ టీకా మొదటి డోసు అందగా, వీరిలో 15%మంది రెండో డోసు కూడా వేయించుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు సరిపోను ఉన్నాయని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement