
తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి
కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పక్కన పుణ్యక్షేత్రం
కోరిన కోర్కెలు నెరవేర్చే మత్స్యగిరీంద్రుడు
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం తెలంగాణలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచింది. చుట్టూ ఎత్తయిన గుట్టలు, పచ్చని పంట పొలాలు.. మధ్య కొత్తగట్టు. ఆ గుట్టపై మత్స్యగిరీంద్రస్వామి ఆలయం. దీన్ని వందల ఏళ్ల కిందట నిర్మించినదిగా చెబుతారు. స్వామివారి దర్శనంతో భక్తులు పునీతమవుతున్నారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పక్కన కరీంనగర్‌కు 30 కి.మీ., వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. విష్ణుమూర్తి మత్స్యగిరీంద్ర స్వామి అవతారానికి ప్రతీకగా గుడిలోని గుహలో వెలసిన చేప భక్తులకు దర్శనమిస్తోంది.
గుహలో చేప అవతారం
సృష్టికి మూలమైన చతుర్వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు తస్కరించి సప్త సముద్రాల అవతల దాక్కున్నాడని, చతుర్వేదాలను పరిరక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్యవతారంలో సముద్రాలను దాటి చతుర్వేదాలను పరిరక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి మత్సా్యవతారం ధరించాక కొత్తగట్టు గుట్టపై గుహలో చేప ప్రతిరూపంతో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. గుహలో చేప ప్రతి ఇప్పటికీ ఉండగా అద్దం ఏర్పాటు చేసి ప్రతిబింబాన్ని భక్తులు వీక్షిస్తారు.
ఆలయ ఉత్సవాలు..
ఆలయంలో మత్స్యగిరీంద్రస్వామి, నర్సింహస్వామి, గుట్టపై ఆంజనేయస్వామి, శివాలయం, కోనేరు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ఏటా మాఘమాసంలో మత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భీషే్మకాదశి సందర్భంగా భూదేవి, నీలాదేవి సహ స్వామివారి కల్యాణం వైభవంగా జరుపుతారు. మాఘపౌర్ణమి సందర్భంగా జాతర, నాకబలి (పుష్పయాగం), కోనేరులో చక్రస్నానం వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. అనుబంధ ఆలయాల్లో హనుమాన్ జయంతి, నర్సింహ జయంతి, మహాశివరాత్రి, జాగరణ, శివకల్యాణం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పోలు దండ వేసుకుంటే సంతానం..
సంతానం కలుగని దంపతులు నాకబలి రోజు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుందని భక్తుల విశ్వాసం. ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల కోసం భక్తులు ఎగబడతారు. గరుడ ముద్దల ప్రసాదం దక్కిన భక్తులకు స్వామివారు, అమ్మవారి చల్లని దీవెనలు ఉంటాయన్న నమ్మకంతో పాటు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది.
శేషం వంశస్తుల పూజలు
మత్స్యగిరీంద్రస్వామికి శేషం వంశస్తులు 11 వందల ఏళ్లుగా స్వామివారిని పూజిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ధూప, దీప, నైవేద్యం, బ్రహ్మోత్సవాల ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు సమక్షంలో జరుగుతున్నాయి.
పోచమ్మను దర్శించుకుని గుట్టపైకి..
గుట్టకింద పోచమ్మ ఆలయంలో దర్శనం చేసుకుని ఘాట్‌రోడ్డుపై నుంచి ఆలయం చేరుకోవాలి. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు మత్స్యగిరీంద్రస్వామి, చేప ప్రతిమను దర్శించుకుంటారు. పక్కనే ఉన్న నర్సింహస్వామికి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆంజనేయస్వామి, శివాలయంలో శివుడికి పూజలు చేస్తారు.
చదవండి: ఆనంద ద్వీపం.. అభివృద్ధికి ఆమడ దూరం
సాగని అభివృద్ధి..
తెలంగాణలో ఏకైక మత్స్యగిరీంద్రస్వామిగా ప్రసిద్ధి చెందిన కొత్తగట్టు ఆలయ ప్రాకారం నిర్మాణం 12 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఏడాది కిందట గాలిగోపురం నిర్మాణానికి దాతలు కాంట్రిబ్యూషన్ చెల్లించినా.. పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కల్యాణ మండపం, ఆంజనేయస్వామి, పోచమ్మ ఆలయాలను దాతలు నిర్మించారు.

ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహం
ఎన్‌హెచ్‌ఏ–563 రహదారి టోల్‌గేట్ కొత్తగట్టు ఆలయం వద్ద నిర్మిస్తున్నారు. భారీ మత్స్యగిరీంద్రస్వామి విగ్రహాన్ని కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన గుట్టపై ఓ భక్తుడు నిర్మిస్తున్నారు. దీంతో ఈ విగ్రహం విద్యుత్ దీపాల కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పోలు దండలు వేసుకుంటే సంతానం
ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల ప్రసాదం స్వీకరించి, నాకబలి రోజు సంతానం కలుగని దంపతులు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుతుందనేది ప్రగాఢ నమ్మకం. ఇలా చేసిన అనేకమంది దంపతులకు సంతానం కలిగింది. కోనేరులో పవిత్రస్నానాలు చేసి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పంటలకు చీడపీడలు సోకితే కోనేరులో నీటిని చల్లుకుంటే వాటి ఉధృతి తగ్గుతుందని రైతులకు నమ్మకం.
– శేషం మురళీధరాచార్యులు, ప్రధాన అర్చకుడు, మత్స్యగిరీంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు