
ప్రముఖ అమెరికన్ నటి, ప్రొడ్యూసర్ కెల్లీ మాక్ (kelley mack) ప్రాణాంతకమైన కేన్సర్‌తో కన్ను మూసింది.అరుదైన మెదడు కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. చిన్న వయసులోనే నటిగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న కెల్లీ అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
జూలై 10, 1992న ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు కెల్లీ మాక్. ది వాకింగ్ డెడ్, 9-1-1 , చికాగో మెడ్ వంటి మూవీలతో బాగా పాపులర్ అయ్యారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కరియర్ పీక్‌లో కొనసాగుతున్న సమయంలో, అరుదైన గ్లియోమా కారణంగా 33 ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కెల్లీ మాక్ సోదరి, కాథరిన్ క్లెబెనో ఇతర కుటుంబ సభ్యులు ఆమె మరణ వార్తను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు.
కెల్లీ మాక్ మరణ వార్త అభిమానుల హృదయాలను కలచి వేసింది. అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ , బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన తరువాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె ప్రియుడు లోగన్ లానియర్ చాలా అండగా నిలిచాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణం తనకు తోడుగా ఉన్నాడని స్వయంగా కెల్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో కెల్లీ తన గ్లియోమా వ్యాధి గురించి అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు.
"సెప్టెంబర్‌లో, నేను నా బాయ్‌ఫ్రెండ్ లోగన్‌తో కలిసి కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారాను. ఆ తర్వాత ఒక నెల పాటు, నడుము నొప్పి విపరీతంగా ఉంది. డిస్క్ జారిందనుకున్నాను. కొన్ని వారాల తర్వాత, నా కుడి క్వాడ్(తొడకు, మెకాలిపైభాగానికి మధ్యలో)లో న్యూరోపతిక్ పెయిన్, ఆపై, కాళ్ళు , వీపులో తట్టుకోలేనంత నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అరుదైన ఆస్ట్రోసైటోమా, డిఫ్యూజ్ మిడ్‌లైన్ గ్లియోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది’’
గ్లియోమా అంటే ఏమిటి?
గ్లియోమా అనేది మెదడు, వెన్నుపాములలో వచ్చే ఒక రకమైన కణితి. న్యూరోగ్లియా అని కూడా పిలిచే గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఈ కణాలు నరాలకు మద్దతు ఇస్తాయి . కేంద్ర నాడీ వ్యవస్థ పనికి సహాయపడతాయి. అన్ని గ్లియోమాలు కణితులు కేన్సర్‌కు దారి తీయవు కానీ చాలా గ్లియోమాలు ప్రాణాంతకమైనవి.
గ్లియోమాలు సాధారణంగా మెదడులో పెరుగుతాయి. కానీ వెన్నుపాములో కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా లాంటి అనేక రకాలు ఉన్నాయి.
గ్లియోమా లక్షణాలు:
గ్లియోమా లక్షణాలు కణితి ఎక్కడ ఉందో, పరిమాణం, కణితిఎంత వేగంగా పెరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటాయి. నొప్పి, వాంతులు, దృష్టి సమస్యలు, బలహీనత, మూర్ఛలు సాధారణంగా కనిపించే లక్షణాలు. గ్లియోమా చికిత్స కణితి రకం, పరిమాణం, వచ్చిన ప్లేస్‌పై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ , కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు.