కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!

KBC 5 Winner Sushil Kumar: How Is Life Change After Won 5 Crore Rupees - Sakshi

కౌన్‌ బనేగా కరోడ్‌పతి 5వ సీజన్‌ విజేత సుశీల్‌ కుమార్‌ గుర్తున్నాడా? ఇప్పుడు అతడి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే కేబీసీ 13వ సీజన్‌ ఆగస్టు 23 నుంచి ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో సుశీల్‌ కుమార్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు.  2011లో కేబీసీ విజేతగా నిలిచిన ఈ బిహారీ కామన్‌మేన్‌ నిజ జీవితంలో మాత్రం విఫల వ్యక్తిగా మిగిలాడు. రియాలిటీ క్విజ్‌ షోలో మొట్ట మొదటిసారిగా గెలిచిన 5 కోట్ల రూపాయలను ఇష్టారీతిని ఖర్చు చేసి చివరకు దివాళా తీశాడు. తన విఫలగాథను పేస్‌బుక్‌ పేజీలో గతేడాది ఏకరవు పెట్టాడు.

2011లో కేబీసీ 5వ సీజన్‌లో విజేతగా నిలిచి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్‌ అందుకున్నాడు సుశీల్‌ కుమార్‌. కానీ ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘2015-16 నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడిన సమయం. ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఆ టైమ్‌లో నేను లోకల్‌ సెలబ్రిటీ అయిపోయాను. బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెలకు 10 నుంచి 15 కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. క్షణం తీరిక లేకపోవడంతో చదువులకు దూరమయ్యాను. లోకల్‌ సెలబ్రిటీ హోదా రావడంతో మీడియా కూడా నా వెంట పడేది. జర్నలిస్టులు నా ఇంటర్వ్యూలు తీసుకునే వారు. నా గురించి గొప్పగా రాసేవారు. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏదేదో చెప్పేసేవాడిని. కాని కొన్నిరోజుల తర్వాత చూస్తే నా పరిస్థితి మొత్తం తలకిందులైంద’ని సుశీల్‌ రాసుకొచ్చాడు. 


ఎంతో మంది మోసం చేశారు

కేబీసీలో ఐదు కోట్లు సంపాదించడంతో స్వచ్చంద సంస్థలు సుశీల్‌ కుమార్‌ వెంట పడ్డాయి. ముందు వెనుక చూడకుండా అతడు దానధర్మాలు చేసి మొత్తం ఊడ్చిపెట్టడంతో భార్యతో విభేదాలు తలెత్తాయి. ‘కేబీసీలో గెలిచాక మహా దాతగా మారిపోయాను. రహస్యంగా దానాలు చేయడం వ్యసనంగా మారిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని చాలా మంది నన్ను మోసం చేశారు. దానాలు చేసిన తర్వాతే ఈ విషయం నాకు బోధపడింది. ముందు వెనుక చూడకుండా దానాలు చేయొద్దని నా భార్య పోరు పెట్టేది. దీంతో నా భార్యతో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నెమ్మదిగా మద్యానికి, పొగ తాగడానికి అలవాటుపడ్డాను. నేను ఢిల్లీలో వారం రోజులు ఉన్నప్పుడు పలు రకాల వ్యక్తులతో కలిసి మద్యం, ధూమపానం చేసేవాడిని. అక్కడ వారి మాటలు నాకు బాగా నచ్చేవి. దీంతో మీడియాను తేలిగ్గా తీసుకోవడం ప్రారంభించాన’ని సుశీల్‌ కుమార్‌ వెల్లడించాడు.


దావానలంలా దివాళా వార్త..

తాను దివాళా తీశానన్న వార్త బయటకు రావడంతో జనం తనను పట్టించుకోవడం మానేశారని, కార్యక్రమాలకు పిలవడం మానేశారని సుశీల్‌ చెప్పాడు. ‘నేను ఎలా దివాళా తీశాననే విషయం గురించి సినిమాటిక్‌గా చెబుతా. ఒకసారి ఇంగ్లీషు న్యూస్‌పేపర్‌ జర్నలిస్ట్‌ ఒకరు నాకు ఫోన్‌ చేసి విసిగించడంతో.. నా డబ్బు మొత్తం అయిపోయిందని, నా దగ్గర కేవలం రెండు ఆవులు మాత్రమే ఉన్నాయని.. పాలు అమ్ముకుని బతుకుతున్నానని చెప్పాను. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో నా వెంట పడటం మానేశార’ని చెప్పుకొచ్చాడు. 


సినిమా కల.. ముంబై వల

భార్యతో విభేతాలు తలెత్తడంతో దర్శకుడు కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ముంబైకి మకాం మార్చాడు సుశీల్‌ కుమార్‌. ‘ముంబైలో నాకు సన్నిహితులైన గీత రచయితలతో రోజుల తరబడి మంతనాలు జరిపాను. రూమ్‌లో ఉంటూ రోజంతా సినిమాలు చూసేవాడిని. పుస్తకాలు చదివాను. ఇలా ఆరు నెలల కాలం గడిపేశాను. అప్పుడే రోజుకో ప్యాకెట్‌ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత మూడు స్క్రిప్ట్‌లు రాశాను. ఒక ప్రొడక్షన్ హౌస్ నా స్క్రిప్ట్‌లకు 20 వేల  రూపాయలు కూడా ఇచ్చింది. కొంత కాలం తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి. దాంతో ముంబై నుంచి మా ఊరికి తిరిగి వచ్చి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాన’ని తెలిపాడు. 


ఇప్పుడంతా హ్యాపీ!

‘ముంబైలో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపిన తర్వాత నాకు విషయం బోధపడింది. ఫిల్మ్‌ మేకర్‌ కావడానికి ముంబై రాలేదని.. సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చానని అర్థమయింది. మనసుకు నచ్చిందే చేయాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఊరికి తిరిగి వచ్చి టీచర్‌ ఉద్యోగానికి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. మొత్తానికి జాబ్‌ సాధించాను. మందు, సిగరెట్‌ మానేశాను. పర్యావరణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి రోజు నాకు పండగలా గడుస్తోంది. తిండికి లోటు లేకుండా సంపాదిస్తే చాలు అనుకుంటున్నాను. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాన’ని సుశీల్‌ కుమార్‌ ముగించాడు. సో.. సొమ్ములు సంపాదించడమే కాదు.. సవ్యంగా ఖర్చు పెట్టడం తెలియాలని సుశీల్‌ లైఫ్‌ స్టోరీ కళ్లకు కడుతోంది!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top