
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్‌లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు....
గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్‌లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు.
11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్‌పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.
ఒలింపిక్స్ లక్ష్యం
భారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్
– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు