'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు.. | International Yoga Day 2024 BKS Iyengar Yoga Pioneer, Know About His Life Story In Telugu | Sakshi
Sakshi News home page

పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..

Published Fri, Jun 21 2024 11:31 AM | Last Updated on Fri, Jun 21 2024 12:56 PM

International Yoga Day 2024 BKS Iyengar Yoga Pioneer

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్‌ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. 

ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్‌ లేదా బీకేఎస్‌ అయ్యంగార్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్‌ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్‌ అయ్యంగార్‌ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!

బీకేఎస్‌ అయ్యంగార్‌ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్‌, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్‌ సందర్శనకు వచ్చిన అమెరికన్‌ బ్రిటీష్‌ వయోలిన్‌ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్‌ యోగా గురువు అయ్యంగార్‌ని కలవడం జరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్‌ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్‌ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్‌ని తనతోపాటు స్విట్జర్లాండ్‌, లండన్‌ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్‌ న్యూయార్క్‌ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్‌ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్‌స్టిట్యూట్‌లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్‌ ఆన్‌ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. 

ఎవరంటే..
అయ్యంగార్‌ డిసెంబర్‌ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్‌ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. 

ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్‌లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. 

ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో  ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్,  ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ  వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్‌ మరణించారు. 

(చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement