breaking news
bks iyengar
-
'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు..
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ లేదా బీకేఎస్ అయ్యంగార్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్ అయ్యంగార్ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!బీకేఎస్ అయ్యంగార్ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ సందర్శనకు వచ్చిన అమెరికన్ బ్రిటీష్ వయోలిన్ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్ యోగా గురువు అయ్యంగార్ని కలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్ని తనతోపాటు స్విట్జర్లాండ్, లండన్ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్ న్యూయార్క్ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్ ఆన్ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. ఎవరంటే..అయ్యంగార్ డిసెంబర్ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్‌లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్ మరణించారు. (చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం) -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
యోగా గురువుకు గూగుల్ సెల్యూట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి సందర్భంగా గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. కర్ణాటకకు చెందిన బెల్లూరు కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్ 97వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన లోగోలో ఒక 'ఓ' అనే అక్షరాన్ని తీసి.. ఆ స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్లు ఉన్న బొమ్మను పెట్టింది. అయ్యంగార్ యోగా పేరుతో బీకేఎస్ అయ్యంగార్ ప్రవేశపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం లభించింది. 1918లో కర్ణాటకలో పుట్టిన అయ్యంగార్.. 2014 ఆగస్టు 20వ తేదీన పుణెలో మరణించారు. పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు అన్ని రకాల అవార్డులు ఆయనను వరించాయి. -
యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ మృతి
అయ్యంగార్ యోగా అనే ప్రత్యేక యోగా పద్ధతిని కనుగొన్న ప్రముఖ యోగా గురువు పద్మ విభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ పుణెలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. అయ్యంగార్‌కు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య రావడంతో గత మంగళవారం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం నాడు మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఆయనకు డయాలసిస్ చేశారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఆయనకు 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఈ సంవత్సరం ఆరంభంలో పద్మవిభూషణ్ సత్కారాలు లభించాయి. ఆయన యోగా గురించి అనేక పుస్తకాలు కూడా రాశారు. అయ్యంగార్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ అభిమానులకు సంతాపం తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయని, ప్రపంచంలోని చాలామందికి ఆయన యోగాను పరిచయం చేశారని ఆయన అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) I am deeply saddened to know about Yogacharya BKS Iyengar's demise & offer my condolences to his followers all over the world. — Narendra Modi (@narendramodi) August 20, 2014 Generations will remember Shri BKS Iyengar as a fine Guru, scholar & a stalwart who brought Yoga into the lives of many across the world. — Narendra Modi (@narendramodi) August 20, 2014