'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..! | International Tea Day: These Indian women's tea entrepreneurs | Sakshi
Sakshi News home page

International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!

May 21 2025 9:33 AM | Updated on May 21 2025 10:02 AM

International Tea Day: These Indian women's tea entrepreneurs

రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్‌ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...

భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్‌ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్‌ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు. 

కెఫిన్‌ లేని టీ 
ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్‌ టీ సొమెలియర్‌గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్‌’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్‌ను అందిస్తోంది. 

‘టీ వ్యాపారం గురించి ప్రొఫెషనల్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్‌ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్‌ను ప్రారంభించాను. వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. 

దీంతో దృష్టిని ఈ–కామర్స్‌ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్‌కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్‌ గ్రీన్‌ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్‌ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్‌ ఉండదు.  
– స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్‌

ఇమ్యూనిటీలు
‘చాయ్‌ డైరీస్‌’ పేరుతో తన లైఫ్‌ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్‌ బిజినెస్‌ స్కూల్‌లో బిజినెస్‌ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్‌ కేఫ్‌ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్‌మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్‌ లేకుండా చాయ్‌ డైరీస్‌ ప్రారంభించాను. కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబడి  సహకారమూ లేదు. 

అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్‌ టైమ్‌లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్‌ బాంబే మసాలా టీ లోపాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్‌టెయిల్, ఐస్డ్‌ టీ వంటివి సలాడ్‌ డ్రెస్సింగ్‌గా కూడా ఉపయోగించవచ్చు.’
– అమీ భన్సాలీ, చాయ్‌ డైరీస్‌ 

తయారీలో సమయం తెలియదు
తండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్‌ వాసి అనామికా సింగ్‌. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్‌ని సృష్టించాను. 

ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్‌ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం. పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్‌ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్‌ నీడిల్, ఫైన్‌వుడ్‌ స్మోక్డ్‌ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’
– అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీ

కచ్చితమైన సమయపాలన
లండన్‌లో ఒక గ్లోబల్‌ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్‌ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు.  ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. 

బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్‌ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్‌రేట్‌ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్‌ ప్రకారం ప్రతి కస్టమర్‌కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది.
– మయూర రావు, ఆసమ్‌ టీ 

(చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement