ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా! | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా!

Published Thu, May 18 2023 1:41 AM

International phone calls are financial scams - Sakshi

ఇటీవల ఇండోనేషియా (+62), వియత్నాం (+84), మలేషియా (+60), కెన్యా (+254), ఇథియోపియా (+251)..  మొదలైన దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌ను తమకు తెలియకుండా అప్రయత్నంగా.. అనుకోకుండా రిసీవ్‌ చేసుకుంటూ ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు చాలా మంది. ఈ సైబర్‌నేరగాళ్ల నుంచి జాగ్రత్తపడటమే కాదు మన తోటివారికీ అవగాహన కలిగించడం అవసరం. 

ఆఫీసుకువెళ్లే హడావిడిలో ఫోన్‌ మోగితే లిఫ్ట్‌ చేసింది గీత. ఒక లార్జ్‌ గ్రూప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ఆదాయ వనరులను పరిచయం చేయబోతున్నామని, అందుకు సంబంధించిన వివరాలను ఫోన్‌కి పంపుతున్నామని చెప్పారు కాలర్‌. అందుకు ఎన్ని లెవల్స్‌ ఉంటాయో, ఎలా పాల్గొనవచ్చో కూడా చెప్పిన విధానం గీతకు బాగా నచ్చింది.

ముందు ఫ్రీ టాస్క్‌లో పాల్గొని, అంతా నచ్చితే కొనసాగించమని, అందుకు సంబంధించిన వివరాల మెసేజ్‌ను పంపుతామని, చెక్‌ చేసుకోమని, గ్యారంటీ ్రపాఫిట్‌ అని చెప్పడంతో గీతకు ఆనందమేసింది. ఆఫీసుకు వెళ్లాక ఫోన్‌కి వచ్చిన వాట్సప్‌ మెసేజ్‌ చూసింది. గ్రూప్‌లో జాయినవమని వచ్చిన మెసేజ్‌ అది. ఆ గ్రూప్‌లో జాయిన్‌ అయింది. చాలా మంది ఉన్న ఆ గ్రూప్‌లో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని అర్ధమైంది.

ఆ గ్రూప్‌లో చూపించిన విధంగా తన అకౌంట్‌కి లాగిన్‌ అయి, ఫ్రీ టాస్క్‌లో చేరితే వెంటనే తన అకౌంట్‌లోకి రూ.500 వచ్చాయి. ఆనందపడుతూ వాళ్లు చెప్పిన టాస్క్‌ని పూర్తి చేస్తే, మరో రూ.1000 జమ అయ్యాయి. వాటిని విత్‌ డ్రా చేసుకున్నాక, పెయిడ్‌ టాస్క్‌కు వెళ్లి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాక కానీ, అర్ధం కాలేదు గీతకు తను మోసపోయానని. విదేశీ మోసగాళ్లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. 

ఫేక్‌ లైక్స్‌..
డీపీ లు మొత్తం ఇండియన్‌ అమ్మాయిల ఫొటోలు ఉంటాయి. కానీ, ఫేక్‌ప్రొఫైల్స్‌ ఉంటాయి. మనవాళ్లే కదా అని జాయిన్‌ అవుతాం. వాయిస్‌ కూడా మన ఇండియన్‌ స్టైల్‌లోనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ లైక్స్, యూ ట్యూబ్‌ వ్యూస్‌...పెంచడం కోసం ఒక టాస్క్‌ ఉంటుంది. ముందు ఫ్రీ టాస్క్‌ల పేరుతో ఆకట్టుకుంటారు. మనకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ గేమ్‌ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిజమైన ప్లేయర్లతో పాటు స్కామర్లు కూడా ఉంటారు.

రూ. 500 వచ్చాయని, రూ.1000 వచ్చాయని స్క్రీన్‌ షాట్స్‌ షేర్‌ చేస్తుంటారు. కొంత టైమ్‌ అయ్యాక ఫ్రీ టాస్క్‌ పూర్తయిందని, పెయిట్‌ టాస్క్‌ ఉందని చెబుతారు. వీటిలో మళ్లీ రకరకాల గ్రూప్స్‌లో మనల్ని యాడ్‌ చేస్తారు. రూ.1000 పెడితే 1300 ఇస్తాడు. వెంటనే 300 రావడంతో ఆశ పెరుగుతుంది. 5000 పెడితే మరో 2000 అదనంగా వస్తాయని చూపుతారు. ప్రతీ టాస్క్‌ పై ఒత్తిడితో కూడా ప్రెజర్‌ ఉంటుంది.రూ. 7000 మన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసేలోపు టైమ్‌ లాప్స్‌ అయిపోయిందని చెబుతారు.

దీనిని డ్రా చేయాలంటే రూ. 10000 పెట్టమంటారు. ఇవన్నీ మల్టిపుల్‌ అకౌంట్స్‌ , ఇండియన్‌ అడ్రస్‌ ఉన్న ప్రైవేట్‌ బ్యాంకుల ఖాతాలు చూపుతారు. మనం నిజమే కదా అని నమ్మి వాళ్ల ట్రాప్‌లో పడతాం. అప్పుడు మెల్ల మెల్లగా రూ.50 నుంచి మొదలు పెట్టి పది లక్షల వరకు రూట్‌ మార్చుతుంటారు. ఇరవై రోజుల క్రితం 20 లక్షలు వరకు జరిగిన మోసం నిన్న 60 లక్షల రూపాయలతో సైబర్‌ క్రైమ్‌లో కేస్‌ నమోదైంది.

స్పామ్‌ కాల్స్‌కి ఆన్సర్‌ చేయద్దు
తెలియని ఇంటర్నేషనల్‌ ఫోన్‌ కాల్స్‌ని నమ్మద్దు. ఈ కాల్స్‌ వచ్చినప్పుడు అపనమ్మకంగానే కాదు అప్రమత్తంగానూ ఉండడటం అవసరం.
♦ కాలర్‌ ఐడెంటిటినీ వెరిఫై చేసుకోవాలి. 
♦ ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్, బ్యాంక్‌ అకౌంట్‌ వంటి వ్యక్తిగత వివరాలను కాలర్స్‌కి ఇవ్వద్దు. 
♦ స్పామ్‌ కాల్స్‌ని రిసీవ్‌ చేసుకోవద్దు. అలాంటి వాటిని ట్రూ కాలర్‌లో చెక్‌ చేసుకోండి. 
♦ వాట్సప్, టెలిగ్రామ్, ట్రూ కాలర్‌లో అనుమానించదగిన ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు ఆ యాప్స్‌కి రిపోర్ట్‌ చేయడం మర్చిపోవద్దు. ఒక సింగిల్‌ స్టెప్‌ ద్వారా యూజర్‌ రిపోర్ట్‌ చేయచ్చు. 
♦ ఏ కాలర్‌ కూడా మనల్ని డబ్బు కట్టమని అడగరు. ఇలాంటప్పుడు గ్రూప్‌లో నుంచి ఎగ్జిట్‌ అవడం లేదా హ్యాంగప్‌ చేయాలి. 
♦ ఏం చేస్తారో చూద్దాం అనుకొని గ్రూప్‌లో కొందరు ఎగ్జిట్‌ అవక అలాగే ఉండిపోతారు. అలాంటివాళ్లే ఎక్కువ ఇన్వెస్ట్‌ చేసి మోసపోతారు. గ్రూప్‌లో అలాగే ఉండి మిగతా మెంబర్లు ‘మాకు డబ్బులు వచ్చాయి’ అని షేర్‌ చేసే, స్క్రీన్‌ షాట్‌లకు పడిపోవద్దు. 

మోసపోతే..
♦ 1930కి కాల్‌ చేయాలి. 
హెల్ప్‌లైన్‌ వాళ్లు మోసపోయిన ఆధారాల డాక్యుమెంట్స్‌ ఇవ్వమంటారు. 
♦ మోసగాళ్లు మల్టిపుల్‌ అకౌంట్స్‌ను ఉపయోగిస్తుంటారు. మన ద్వారా వాటికి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తారు. వాటి ఆధారంగా ఆయా రోజుల్లో మన ఖాతాలో నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయో, మన ఖాతాకు ఎవరి ద్వారా డబ్బు వచ్చిందో చూసి ఆ అకౌంట్స్‌ అన్నింటినీ ఫ్రీజ్‌ చేస్తారు. అప్పుడు కేస్‌ ఫైల్‌ చేసి, ఇన్వెస్టిగేషన్‌ చేస్తారు. పూర్తి ఇన్వెస్టిగేషన్‌ చేసి, మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు. 

- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement