హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
రిటైర్డ్ బ్యాంకర్‌కు రూ.1.25 కోట్ల నష్టం
సికింద్రాబాద్‌కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్‌షాట్‌లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్‌ను ఆమె డౌన్‌లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్‌లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
మరో మూడు కేసులు
జనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.
మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.
76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.
మియాపూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.
పోలీసుల హెచ్చరికలు
ఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.
ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..


