పోరాట స్ఫూర్తి | Sakshi
Sakshi News home page

పోరాట స్ఫూర్తి

Published Sat, Mar 19 2022 1:12 AM

International Film Festival of Kerala 2022: IFFK to commence on Friday with screening of Rehana Maryam Noor - Sakshi

‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్‌ చిత్రం ‘రెహన మరియమ్‌ నూర్‌’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌.

ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్‌ ఫిల్మ్‌మేకర్‌ లిసా కలన్‌ను ‘స్పిరిట్‌ ఆఫ్‌ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్‌’ది అచ్చంగా అలాంటి కథ...

ఐసిస్‌ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్‌’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్‌ ఆఫ్‌ ది స్ట్రీట్‌’ సినిమాకు సౌండ్‌ అండ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది.

టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్‌ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్‌’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం.
చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్‌ టైగ్రన్‌ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్‌ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం.

ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది.
ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి  తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్‌ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్‌ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది.

మృత్యువు ఎదురొచ్చిన రోజు...
జూన్, 2015లో దియర్‌బకిర్‌ నగరంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్‌’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు.
మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది.

‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు.
ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది.

‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement