Shanta Verma: వయసా? హహ్హా...

Inspiring Story Of Shanta Verma Who Became Fashion - Sakshi

50 వచ్చేశాయి.. 60 వచ్చేశాయి.. బాబోయ్‌ 70 వచ్చేశాయి. ఉత్తరప్రదేశ్‌ శాంతా వర్మకు 76. ‘అప్పుడే ఏం వయసొచ్చిందనీ?’ అంటుందామె నవ్వుతూ. హాయిగా భర్తతో కలిసి వీడియోలు చేస్తుంది. నవ్వుతుంది. ఫ్యాషన్‌ దుస్తులు ధరిస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులతో 16000 మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. ‘కృష్ణా రామా అనుకునే వయసు’ అని ఎవరైనా అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘ఈ స్టీరియోటైప్స్‌ను బద్దలు కొట్టండి. సంతోషంగా జీవించండి’ అంటుందామె. వయసును ఫీలవుతూ కుంగుబాటు తెచ్చుకునేవారు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

76 ఏళ్ల శాంతా వర్మ తన జీవితంలో ఎన్నో సుదీర్ఘమైన రోజులు, నెలలు, సంవత్సరాలు చూసి ఉంటుంది. కాని ఇప్పుడు ఆమె నిజంగా బతుకుతున్నది ‘30 సెకన్ల’లో. అవును. ఆమె చేసే 30 సెకన్ల వీడియోలు ఆమెను సంతోషంగా ఉంచుతున్నాయి. పాపులర్‌ చేస్తున్నాయి. అభిమానులను సంపాదించి పెడుతున్నాయి. వయసు గడిచిపోయింది అనుకుంటుంటారు కొందరు ఒక వయసు వచ్చాక. కాని శాంతా వర్మ వయసు మొదలైంది అనే భావనలో ఉంటారు. ఆమె ఇప్పుడు సోషల్‌ మీడియా సన్సెషన్‌.

వీడియోల్లో ఆమె
చీరలో సంప్రదాయంగా ఆమె దేవుని పటానికి దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన గదిలోకి రాగానే ఫోన్‌ అందుకుంటుంది. ఆ ఫోన్‌లో చూసిన ఫ్యాషన్‌ దుస్తులను మనకు చూపించి క్షణాల్లో వాటిలోకి మారిపోతుంది. మహా మహా మోడల్స్‌కు లేనంత గ్రేస్‌తో అంటే ఏమాత్రం ఎబ్బెట్టుగా లేకుండా వాటిలో కనిపిస్తుంది. మోడ్రన్‌ దుస్తుల్లో ఆమె అంత చక్కగా కనిపించడం నిజంగా విశేషం.

మరో వీడియోలో హైహీల్స్‌ చెప్పుల డబ్బా విప్పుతుంది. ఒక హై హీల్‌ను ఎగరేస్తుంది. అంతే. విఠలాచార్య సినిమాలో లాగా ఆ హైహీల్స్‌తో వాటికి తగ్గ షర్ట్‌ అండ్‌ స్కర్ట్‌లో కుర్చీలో దర్జాగా కనిపిస్తుంది.

మరో వీడియోలో మనవరాలితో కలిసి కోడి కూత పెట్టినట్టు పెడుతూ స్టెప్పులేస్తుంది. ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో 30 సెకన్ల వీడియోలు పెట్టే వీలుంది. ‘రీల్స్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి 30 సెకన్ల వీడియోలతో శాంతా వర్మ పాపులర్‌ అయ్యింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పేరు ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ వర్మ’.

జీవిస్తున్న క్షణాలు
శాంతా వర్మ సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌లోని భోకర్‌హెడి అనే చిన్న పల్లెటూరు. 15 ఏళ్ల వయసులో యశ్‌పాల్‌ సింగ్‌తో పెళ్లయ్యింది. ‘ఆ తర్వాత నా జీవితం అంతా అత్తామామలను చూసుకోవడం, పిల్లలని పెంచడం, వంట చేయడం, ఇల్లు కట్టుకోవడంతోనే సరిపోయింది. స్త్రీలకు కలలు, ఆకాంక్షలు, సరదాలు, ముచ్చట్లు ఎన్నో ఉండొచ్చు. కాని వాటికి టైమ్‌  లేకుండానే జీవితం గడిచిపోతుంది. కాని జీవితాన్ని ఎప్పుడైనా మొదలెట్టొచ్చని నాకు ఇప్పుడు అనిపిస్తోంది’ అంటుంది శాంతా.

82 ఏళ్ల భర్తతో కలిసి హర్యానాలోని కల్క అనే చిన్న ఊళ్లో స్థిరపడిన శాంతా వర్మ అక్కడ తన కొడుకు, కోడలు, మనవరాలితో కలిసి జీవిస్తోంది. ‘గత సంవత్సరం లాక్‌డౌన్‌లో నా మనవరాలు జనిత నాకు ఇన్‌స్టాగ్రామ్‌ను పరిచయం చేసింది. ఇక అంతే. దానికి నేను అతుక్కుపోయాను’ అంటుంది శాంతా వర్మ.

నిజానికి శాంతా వర్మ మనవరాలు జనిత తాతగారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని మొదలెడదామనుకుంది. మొదలెట్టింది కూడా. ఎందుకంటే యశ్‌పాల్‌ సింగ్‌ మంచి జోకులు కట్‌ చేయగల సమర్థుడు. ఆయన మీద వీడియోలు షూట్‌ చేస్తుంటే శాంతా వర్మ వచ్చి తాను అంతకన్నా బాగా చేయగలనని చూపించింది. దాంతో ఇద్దరి మీదా వీడియోలు మొదలెట్టింది మనవరాలు. మెల్లగా శాంతావర్మ ప్రతిభ బయటికి వచ్చి ఆమెకు అభిమానులు పెరిగారు.

‘నేను మా ఆయన్ని సరదాగా విమర్శిస్తూ చేసే వీడియోలు నెటిజన్స్‌కు నచ్చుతున్నాయి. మగాళ్లను ఏదో ఒకటి అనాలని ఆడవాళ్లకు ఉంటుంది కదా’ అంటుంది శాంతా వర్మ. భర్త మీద వంక పెట్టి ఆమె మగవాళ్లలోని లోపాలను సరదాగా ఎద్దేవా చేస్తూ ఉంటుంది.

61 ఏళ్ల దాంపత్యం
శాంతావర్మకు, యశ్‌పాల్‌ సింగ్‌కు పెళ్లయ్యి 61 ఏళ్లు. ‘ఇన్ని సంవత్సరాలలో మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్‌ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో సపోర్ట్‌ చేస్తారు’ అంటుంది శాంతా వర్మ పెళ్లయిన కొత్తల్లో బుల్లెట్‌ నడపాలని తాను అనుకుంటే భర్త నేర్పడానికి ప్రయత్నించే ఫొటోను చూపెడుతూ. ఆమె భర్త అందుకుంటూ ‘ఆమె ఈ వీడియోలు చేసి తన ప్రతిభను చూపడం మొదలెట్టాక ఉదయాన్నే నా మార్నింగ్‌ వాక్‌ అయ్యాక మా ఇంటి తోటలోని పూలను కోసి ఆమెకు బొకేలా అందించడం తప్పక చేస్తున్నాను. ఆమె సిగ్గుపడుతుంది గాని నేను చేయగల పని అదే’ అంటాడు. భార్యకు పూలు అప్పుడప్పుడన్నా కానుక గా ఇద్దాం అనుకునే వయసులో ఉన్న భర్తలు తక్కువ. కాని యశ్‌పాల్‌ తన ప్రేమ ప్రకటనకు వయసు లేదు అనుకుంటున్నాడు.

16000 మంది అభిమానులు
శాంతా వర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 వేల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఒక నానమ్మ తన భర్తతో కలిసి ఉత్సాహంగా జీవించడం వారిలో స్ఫూర్తి నింపుతోంది. మంచి మంచి బట్టల్లో వీడియోలు చేస్తూ బోర్‌డమ్‌ను నిర్లిప్తతను నిస్సత్తువను వాళ్లు వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే సంతోషపడుతున్నారు. శరీరం ఏ మంచి ప్రకటనకు అయినా సిద్ధంగా ఉంటుంది. మనసులో జీవం ఉండాలి. ఆ జీవాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుందని నిరూపిస్తోంది శాంతా వర్మ.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top