Maryam Afifa Ansari: తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్‌.. మన ‘హైదరాబాదీ’ విజయగాథ

Indian First Female Neurosurgeon From Muslim Community Success Journey - Sakshi

న్యూస్‌ మేకర్‌: తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్‌

భారతదేశంలో ముస్లిం సముదాయం నుంచి తొలి మహిళా న్యూరోసర్జన్‌ అయిన ఘనత డాక్టర్‌ మరియమ్‌ హఫిఫా అన్సారీకి దక్కింది. ఆమె హైదరాబాదీ కావడంతో తెలంగాణకు కూడా ఈ ఖ్యాతి దక్కినట్లే. పదవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివిన హఫిఫా ఆ తర్వాత నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో చదువు కొనసాగించి అనేక రికార్డులు సాధించింది. ‘ఆడపిల్లలు తాము అనుకున్నది సాధించేవరకు ఓటమి అంగీకరించవద్దు’ అంటున్న హఫిఫా గురించి...

కొన్ని అద్భుతాలు మన పక్కనే జరుగుతుంటాయి. అయితే అవి వినమ్రంగా ఉండటం వల్ల కూడా మనకు తెలియవు. చిన్న గెలుపుకు ఆకాశమంత ఆర్భాటం చేస్తారు కొందరు. పర్వాతాన్ని పిండి కింద కొట్టినా మెదలకుండా ఉంటారు మరి కొందరు.

28 ఏళ్ల మరియమ్‌ హఫిఫా అన్సారీకి తను సాధించిన విజయం పట్ల చాలా వినమ్రత ఉంది. ఎందుకంటే ఆమె అది తన గెలుపుగా భావించక ‘అల్లా మియా ఇచ్చిన కానుక’ అంటుంది కనుక.

అదే ఆమె ఘనత
డాక్టర్‌ మరియమ్‌ హఫిఫా అన్సారీ మన హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో న్యూరోసర్జరీ రెసిడెంట్‌గా ఉంది. న్యూరో సర్జరీ విభాగంలో చురుగ్గా పని చేస్తూ ఉంది. త్వరలో ఆమె పూర్తిస్థాయి న్యూరో సర్జన్‌గా విధులు నిర్వహించనుంది. అయితే ఏమిటి ఘనత అంటారా? భారతదేశంలో ముస్లింలలో న్యూరోసర్జన్‌ అయిన తొలి మహిళ మరియమ్‌ హఫిఫా.

సాధారణంగా మహిళా డాక్టర్లు పిడియాట్రిషియన్లుగా, గైనకాలజిస్టులుగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను ఎంచుకుంటారు. ఇతర ముఖ్య విభాగాలను ఎంచుకున్నా న్యూరోసర్జరీలోకి ప్రవేశించేవారు తక్కువ. ముస్లింలలో అసలు లేరు. ఆ అడ్డంకిని దాటి న్యూరోసర్జన్‌ అయ్యింది మరియమ్‌ హఫిఫా.

తప్పు అని నిరూపించండి
‘ఆడపిల్లలు అది చేయలేరు.. ఇది చేయలేరు అని కొందరు విమర్శిస్తుంటారు. ఆడపిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలా అనేవారి మాటలు తప్పు అని నిరూపించేలా విజయాలు సాధించాలి’ అంటుంది హఫిఫా. పెయింటింగ్‌లో హఫిఫాకు అభిరుచి ఉంది. కాలిగ్రఫీని కూడా సాధన చేస్తోంది.

సర్జరీ చేస్తున్న హఫిఫా ఫొటోను షేర్‌ చేసి ‘భారతదేశపు తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్‌’ అని గర్వపడింది ఆమె సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని ముస్లిం స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎం.ఎస్‌.ఓ). కాని ఆమె ఆ ఘనత సాధించిందంతా ఇక్కడే కనుక నిజంగా గర్వపడాల్సింది తెలంగాణనే.                                         

ఉర్దూ మీడియమ్‌లో చదివి
హఫిఫా మరియంది మహారాష్ట్రలోని మాలేగావ్‌. అక్కడే ఏడవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకుంది. తల్లి ఉర్దూ టీచర్‌. ఆమె సింగిల్‌ పేరెంట్‌గా తన కుమార్తెను పెంచడానికి సిద్ధపడి హైదరాబాద్‌ వలస వచ్చింది. ఇక్కడే పదోతరగతి వరకూ మళ్లీ ఉర్దూ మీడియంలోనే చదివి టాపర్‌గా నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించింది హఫిఫా.

చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కానీ, సైంటిస్ట్‌ కాని కావాలని ఆమె కల. నెమ్మదిగా సైంటిస్ట్‌ను పక్కన పెట్టి డాక్టర్‌ కలను గట్టిగా పట్టుకుంది. ‘నా ఒంటి మీద తెల్లకోటు, మెడలో స్టెతస్కోపు ఉండాలి. నన్ను అందరూ డాక్టర్‌ హఫిఫా అని పిలవాలి అనుకున్నాను’ అంటుందామె. కాని మెడిసిన్‌ చదివించే స్తోమత లేదు. బాగా చదువుకుంటే తప్ప ఉచిత సీటు రాదు.

దాంతోపాటు ఉర్దూ మీడియంలో చదవడం వల్ల ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియమ్‌కు అలవాటు పడాలి. అందుకే రేయింబవళ్లు చదివేది హఫిఫా. టెన్త్‌ అయ్యాక హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థుల ఎంట్రన్స్‌ కోసం టాలెంట్‌ టెస్ట్‌ పెడితే టాపర్‌గా వచ్చింది హఫిఫా. దాంతో ఒక కాలేజీ వాళ్లు ఇంటర్‌లో ఫ్రీ సీట్‌ ఇచ్చారు. ఆ తర్వాత మెడికల్‌ ఎంట్రన్స్‌లో ఏకంగా 99వ ర్యాంకు సాధించింది.

ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్‌. చదివింది. ఎం.బి.బి.ఎస్‌.లో ఆమెకు ఐదు గోల్డ్‌ మెడల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత ‘పోస్ట్‌ జనరల్‌ సర్జరీ’లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ తర్వాత ఎఫ్‌.ఆర్‌.సి.ఎస్‌. (లండన్‌) పూర్తి చేసింది. 2020లో మళ్లీ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ రాసి 137వ ర్యాంకు సాధించి ‘న్యూరోసర్జరీ’ విభాగాన్ని తీసుకుంది. 

చదవండి: Lotus: నీటి తొట్లలో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేల దాకా
మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ! ఈ పూలు వాడిపోవు.. ఆమె హాబీ.. ఆదాయ వనరుగా ఎలా మారిందంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top