తెరపై కనిపించే అనూ ఇమాన్యుయేల్ కేవలం పాత్ర మాత్రమే!నిజమైన ‘నేను’ మేకప్ తీసేసిన తర్వాత, నిశ్శబ్దంలోనే కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు, ఆమె మాటల్లోనే మీకోసం..
» నా బాల్యం సాధారణంగానే గడిచింది. షికాగోలో పుట్టి, గార్లాండ్, టెక్సాస్‌లో పెరిగాను. కేరళలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, 2011లో మలయాళం సినిమా ‘స్వప్న సంచారి’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. కాని, అదే నా గమ్యం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత చదువు కోసం మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాను.
» సైకాలజీ డిగ్రీ చదువుతూ, మనసులు చదవడం నేర్చుకుంటున్నప్పుడు, నా మనసు ఇంకొక దారి చూపింది. కెమెరా మళ్లీ పిలిచింది. ‘యాక్షన్ హీరో బిజు’తో లీడ్ హీరోయిన్ గా కెమెరా ముందుకు వచ్చాను. ఆ రోజు భయం, ఉత్సాహం ఉంది. అంతకన్నా ఎక్కువగా కొత్త జీవితంలో అడుగుపెట్టినట్లు అనిపించింది.
» ‘మజ్ను’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాక నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త భాష, కొత్త ముఖాలు, కొత్త అంచనాలు. అమెరికాలో పెరిగిన అమ్మాయిగా, ఇక్కడ నన్ను నేను మళ్లీ నిరూపించుకోవాల్సి వచ్చింది. అదే నన్ను మరింత స్ట్రాంగ్ చేసింది.
» పింక్ కలర్ నా ఫేవరెట్. అది ట్రెండ్ కాదు. పింక్ చీర కట్టుకున్నప్పుడు నన్ను నేను బెస్ట్‌గా ఫీల్ అవుతాను. ఒకరకమైన ప్రశాంతత, కాన్ఫిడెన్స్ రెండూ కలిసి వస్తాయి.
» లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ఇష్టం. డ్రైవింగ్ చేస్తూ రోడ్ల మీద వెళ్లడం, డెస్టినేషన్ ముందే నిర్ణయించుకోకుండా దారి మళ్లించడం. అదే నా థెరపీ. అలా ఆ ప్రయాణాల్లోనే నేను నాతోనే ఎక్కువగా మాట్లాడుకుంటాను.
» షూటింగ్ లేనప్పుడు నా ప్రపంచం చాలా సింపుల్. పుస్తకాలు చదువుతూ, బ్యాలే డ్యాన్స్ చేస్తూ చాలా సైలెంట్‌గా ఉంటాను. నిశ్శబ్దం నాకు భయం కాదు. అదే నాకు స్పేస్ ఇస్తుంది.
» తెరపై నేను చాలా కామ్‌గా కనిపిస్తాను. అది నా ప్రొఫెషనల్ ఫేస్ మాత్రమే. నన్ను దగ్గరగా తెలిసినవాళ్లకు తెలుసు – నేను చాలా ఎనర్జిటిక్, కొంచెం క్రేజీ కూడా.
» ‘గర్లఫ్రెండ్’ సినిమాలో దుర్గ పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. కాస్త అమెరికన్ యాక్సెంట్ నాకు సహజంగా అనిపించింది. దాన్ని దాచాలని అనుకోలేదు. ఆ పాత్రకు అదే నిజం అనిపించింది.
» గాసిప్స్, రూమర్స్ ఒకప్పుడు ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా అల్లు శిరీష్‌తో వచ్చిన వార్తలు. ఇప్పుడు వాటిని చిరునవ్వుతో వదిలేయడం నేర్చుకున్నాను. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని అర్థమైంది.
» నాకు ఇప్పుడు లుక్స్ కోసం పాత్రలు కాదు. లోతున్న పాత్రలు కావాలి. నన్ను భయపెట్టే పాత్రలు కావాలి. కంఫర్ట్ జోన్ లోనే ఉండాలని లేదు.


