
దత్తబోధ
భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం సినిమా చూడడానికి ప్రదర్శన శాల (సినిమా హాలు)కు వెళ్లినప్పుడు తెరపై చిత్రాలు ఏ విధంగా కనపడతాయో కొంత అవగాహన ఉంది కదా! ఒక చిన్నగదిలోయంత్రాన్ని (ప్రొజెక్టర్) నడిపిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి తెరపై బొమ్మలు పడేలా చేస్తాడు ఒక వ్యక్తి. అతడు లేకుండా సినిమా ప్రదర్శన సాధ్యమే కాదు. సినిమా నడిపే వ్యక్తి మాత్రం మనకు కనబడకుండా ఉంటాడు. నీవు అతనిని కలవాలని అనుకుంటే అతడితో పరిచయం ఉన్నవాని (మధ్యవర్తి) సహాయంతో కలవవచ్చు. ఆ సినిమా నడిపే అతనితో స్నేహం పెంచుకొన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అతని గదిలోకి ప్రవేశించవచ్చు, అతనితో మాట్లాడ వచ్చు కదా!
ఈ ప్రపంచమే ఒక విశాలమైన చిత్ర ప్రద ర్శనశాల. దీనియందు మనకు ఎప్పుడూ సంభ వించే సంఘటనలే ప్రదర్శనలు. సినిమాలో ఉన్నట్లు, ఇక్కడ కూడా యంత్రాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతను కూడా కనిపించడు. సరైన పరికరాలు, మధ్యవర్తి ఉంటేనే ఆయన కనిపిస్తాడు. ఈ సందర్భంలో మైత్రి అంటే ‘భక్తి’ అని పిలిచే ఒక సాధనాన్ని ఈ కార్య సాధనలో ఉపయోగిస్తూ సద్గురువు అనే మధ్యవర్తి ద్వారా భగవంతుని చూడవచ్చు.
సద్గురువు సహాయంతో భగవంతుని దర్శించుకొన్నవారుఎందరో ఉన్నారు. అటువంటివారి అనుభవాలే మన పవిత్రగ్రంథాల్లో దృష్టాంతాలుగా ఉన్నాయి. భగవంతుని దర్శించుకొనదల చిన వారికి పూర్వం భక్తులు ఏ బాటలో నడచి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో అటువంటివారు నడచిన మార్గాన్ని ఇతిహాసాలు తేట తెల్లం చేస్తున్నాయి. ఆ మార్గంలోనే భక్తి విశ్వాసాలు, ధైర్యంతో నీవు నడచిన ట్లయితే గమ్యాన్ని చేరుకోగలవు. నిన్ను చెడగొడుతున్న సందేహాలు అన్నీ అప్పుడు తొలగిపోతాయి.
శ్రీ గణపతిసచ్చిదానందస్వామి