
కీమా నూడుల్స్ కట్లెట్ తయారీకి కావల్సినవి:
కీమా – పావు కప్పు (మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి)
నూడుల్స్ – 1 కప్పు (నీళ్లల్లో ఉడికించి, జల్లెడ గరిటెతో వడకట్టి పక్కన పెట్టుకోవాలి)
బంగాళ దుంపలు – 2 (మీడియం సైజ్, మెత్తగా ఉండికించి ముద్దలా చేసుకోవాలి)
ఉల్లిపాయ – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి)
క్యారెట్ – 2 టేబుల్ స్పూన్లు (తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు)
క్యాప్సికం –2 టేబుల్ స్పూన్లు
పచ్చి బఠాణీ – 1 టేబుల్ స్పూన్ (నానబెట్టుకోవాలి)
కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
జీలకర్ర పొడి, మసాలా – 1 టీ స్పూన్ చొప్పున
నూడుల్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి, నూడుల్స్‌ని ఉడికించకముందు విరిచి.. కారప్పూసలా చేసుకోవాలి)
గుడ్లు – 2 (చిన్న బౌల్‌లో 1 గరిటెడు పాలు, గుడ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి), నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా..
ముందుగా ఒక పెద్ద బౌల్‌లో ఉడికిన నూడుల్స్, కీమాతో పాటు బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు లేదా తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బఠాణీలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. కట్లెట్స్‌లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి.
అభిరుచిని బట్టి వేయించుకునే ముందే ప్రతి కట్లెట్‌ని గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, నూడుల్స్ ముక్కల్లో దొర్లించి.. అప్పుడు వేయించుకోవచ్చు. వీటిని టొమాటో సాస్‌తో లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.