Hookworm Infection: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!

Hookworm Infection: What Is It Causes Symptoms And Treatment - Sakshi

హుక్‌ వార్మ్‌ అనే పరాన్నజీవి ప్రధానంగా చిన్నపేగుల్లో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని అది సంగ్రహిస్తూ ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువ, పొషకాల లోపంతో పాటు ప్రధానంగా ఐరన్‌ లోపం కనిపిస్తుంది. చాలామందిలో ఇది ప్రధానంగా చిన్నపేగులనే ఆశ్రయించినా కొందరిలో మాత్రం ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలపైనా ప్రభావం చూపవచ్చు. పోలాలకు వెళ్లే పెద్దలూ, మట్టిలో ఆడుకునే పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్‌ గురించి అవగాహన కోసం ఈ కథనం. 

హుక్‌వార్మ్‌ ఇన్ఫెక్షన్‌ అనేది పోలాల్లో నడిచేవారిలో... అది కూడా చెప్పులు, ΄ాదరక్షలు లేకుండా నడిచేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పటికీ కొన్ని మారుమూల పల్లెల్లో ఆరుబయలు మలవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. మలంతో పాటు విసర్జితమైన హుక్‌వార్మ్‌ గుడ్లు ఏదో రూపంలో మనుషుల నోటి ద్వారా మళ్లీ లోనికి ప్రవేశించడం అన్నది దీని జీవితచక్రం (లైఫ్‌సైకిల్‌)లో భాగం. నేల/మట్టి ద్వారా ఇన్ఫెక్షన్‌ వస్తుంటుంది కాబట్టి దీన్ని ‘సాయిల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ హెల్మింథిస్‌’ అంటారు. మనుషులు నేల మీద నడవక తప్పదు కాబట్టి దీని విస్తృతి ఎంతంటే... ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు 10% మందిలో ఈ ఇన్ఫెక్షన్‌ ఏదో ఒక దశలో వచ్చే ఉంటుందనేది ఒక అంచనా. 

లక్షణాలు:

  • కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు జ్వరం
  • పొట్టలో నొప్పి
  • ఆకలి మందగించడం ∙నీళ్ల విరేచనాలు
  • బరువు తగ్గడం ∙రక్తహీనత ∙కొందరిలో దగ్గు / పిల్లికూతలు (ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు) ∙చర్మంపై ర్యాష్‌ (చర్మం ప్రభావితమైనప్పుడు).

ఇదీ ముప్పు...  
తీసుకున్న ఆహారం, దాంతో సమకూరే శక్తి, సారం అంతా హుక్‌వార్మ్స్‌ గ్రహించడంతో  తీవ్రమైన రక్తహీనత, ΄ోషకాల లోపం, ్ర΄ోటీన్స్‌ లోపం వంటి పరిణామాలతో తలతిరగడం, తీవ్రమైన అలసట, కండరాలు పట్టేయడం, ఊపిరి అందక΄ోవడం, ఛాతీలో నొప్పి వంటి అనేక పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంతో క్రమంగా భౌతికంగా, మానసికంగా బలహీనమయ్యే అవకాశం ఉంది.

నిర్ధారణ: మల, రక్త (సీబీపీ) పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. రక్తపరీక్షలో ఈసినోఫిలియా (తెల్లరక్తకణాల్లో ఒక రకం) కౌంట్‌ నార్మల్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మల పరీక్షలో హుక్‌వార్మ్‌ గుడ్లు కనిపిస్తాయి.

నివారణ:

  • కాచివడబోసిన నీళ్లు తాగాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినేయాలి. తినేముందు చేతులు కడుక్కవాలి
  • ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా నిలిపివేయాలి. (పల్లెల్లో సైతం ఇది జరగాలి)
  • మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
  • పెద్దలు పొలాల్లో తిరిగి వచ్చాక, పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి
  • పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా డీ–వార్మింగ్‌ చేయిస్తుండాలి.

చికిత్స: కాళ్లకు లేదా ఒంటి మీద ఎక్కడైనా ర్యాష్‌ కనిపించినా, లేదా ఆకలి / బరువు తగ్గినట్లుగా ఉన్నా, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల తర్వాత వ్యాధి నిర్ధారణ జరి΄ాక వారు మిబెండిజోల్, ఆల్బెండిజోల్‌ వంటి మందుల్ని సూచిస్తారు. 

--డాక్టర్‌ కె. శివరాజు, సీనియర్‌ ఫిజీషియన్‌ 

(చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్‌! లాభాలేమిటంటే?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top