తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్‌! | What Is Anterior Hip Replacement And How Is It Different | Sakshi
Sakshi News home page

తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్‌! లాభాలేమిటంటే?

Aug 27 2023 4:45 PM | Updated on Aug 27 2023 5:07 PM

What Is Anterior Hip Replacement And How Is It Different - Sakshi

మనిషి నిటారుగా నిలబడటానికి, కూర్చోడానికి, పరుగెత్తడానికి... ఒక్కమాటలో చెప్పాలంటే రోజులో చేయాల్సిన చాలా పనులకు తోడ్పడేది తుంటి ఎముక కీలు. తుంటి ఎముకలో సాకెట్‌ లాంటి గుండ్రటి ఖాళీ స్థలం ఉంటుంది. సరిగ్గా ఆ ఖాళీలో అమరిపోయేలా తొడ ఎముక చివరన బంతిలాంటి భాగం ఉండి, ఈ రెండింటి కలయితో కీలు (జాయింట్‌)  ఏర్పడుతుంది. ఈ కీలు వల్లనే రోజువారీ చేసే అనేక పనులు సాధ్యమవుతాయి. ఇటీవల అనేక కారణాలతో... అంటే... వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో, తుంటి ఎముకలో అరుగుదల వల్ల, యాంకలైజింగ్‌ ఆర్థరైటిస్‌తో, మరీ ముఖ్యంగా ఇటీవల కరోనా తర్వాత పాతికేళ్ల లోపు యువతలో సైతం అవాస్క్యులార్‌ నెక్రోసిస్‌ కారణంగా తుంటి ఎముక అరగడం, విరగడం చాలా సాధరణమయ్యింది. ఇలాంటప్పుడు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయడం అవసరమవుతుంది. అయితే ఇదే శస్త్రచికిత్సను ‘యాంటీరియర్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌’ పద్ధతిలో కాస్త వైవిధ్యంగా నిర్వహిస్తున్నారు డాక్టర్‌ నితీశ్‌ భాన్‌. ఈ పద్ధతి అంటే ఏమిటో, దాని వల్ల ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే...

ప్రశ్న : యాంటీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనాలేమిటి? 
నితీశ్‌ భాన్‌ : ‘యాంటీరియర్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర, అసలు సంప్రదాయబద్ధంగా (కన్వెన్షనల్‌గా) చేసే ‘΄ోస్టీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’ అంటే ఏమిటో తెలియాలి. అప్పుడు దానికీ దీనికీ తేడాలేమిటి అనేవి తెలుస్తాయి. నిజానికి హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీని మూడు రకాలుగా చేస్తారు. అవి... మొదటిది పిరుదు వెనకభాగం నుంచీ, రెండోది కాస్త పక్కగా చేసేవి. వీటినే పోస్టీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌గా చెప్పవచ్చు. ఇందులో మూడోది... మనం యాంటీరియర్‌గా చెప్పే...కాలి ముందు వైపు నుంచి చేసే శస్త్రచికిత్స.

సాధారణంగా ‘΄ోస్టీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’లో పిరుదు దగ్గర ఉండే మూడు కండరాల సముదాయంలో పెద్దదైన ‘గ్లుటియస్‌ మాక్సిమస్‌’ అనే పెద్ద కండరాన్నీ, మరికొన్ని కీలకమైన కండరాల్ని కట్‌ చేయాల్సి వస్తుంది. ఇలా కండరాలను కట్‌ చేసి, తుంటి కీలు వరకు వెళ్లాక కీలు మార్పిడి ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కానీ... అతి పెద్దవీ, కీలకమైన కండరాలను కట్‌ చేయడం వల్ల గాయం తగ్గి, అంతా నయం కావడానికి కనీసం ఐదారు నెలలు పట్టవచ్చు. అయితే ‘యాంటీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’లో ఇలా కీలకమైన కండరాల కోత అవసరముండదు కాబట్టి ఇది  తగ్గడానికి 12 రోజులు చాలు. 

ప్రశ్న : శస్త్రచికిత్స ఏదైనప్పటికీ... ఆర్నెల్ల తర్వాతైనా అంతా మునపటిలా ఉంటుందా? 
నితీశ్‌ భాన్‌ : అదే చెప్పబోతున్నా. గ్లుటియస్‌ మాక్సిమస్‌ లాంటి అతి పెద్ద కండరం కట్‌ చేయడం వల్ల ‘΄ోస్టీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’ శస్త్రచికిత్స తర్వాత అనేక ప్రతిబంధకాలూ, ప్రతికూలతలు ఉంటాయి. మనం నిలబడటానికి, కూర్చోడానికి, కూర్చున్న తర్వాత లేవడానికి, కదలడానికి, నడవడానికి, పరుగెత్తడానికి... ఇలా చాలా కదలికలకు తోడ్పడే కండరం కావడంతో... హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ తర్వాత అనేక ఆంక్షల్ని పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకవైపు ఒరిగి పడుకున్నప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా తీసుకురాకూడదు.

కూర్చున్నప్పుడు పాదాలు లోపలివైపునకు ఉండేలా కాళ్లు దగ్గరగా పెట్టుకోకూడదు. కూర్చుని ముందుకు వంగ కూడదు. కూర్చుని కాళ్లు ముడిచినప్పుడు 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీలు లోపలికి ముడవలేం. కూర్చుని ముందుకు వంగి సాక్స్‌ తొడగలేము, షూలేసులు కట్టుకోలేం. అంతెందుకు... సోఫాలో నిర్భయంగా, నిశ్చింతగా, సౌకర్యంగా కూర్చోడానికీ జాగ్రత్త ΄ాటించాలి. ఎందుకంటే ΄ోస్టీరియర్‌ పద్ధతిలో కీలు మార్పిడి తర్వాత... ప్రతి కదలికలోనూ కీలు తన స్థానం నుంచి తొలగి ΄ోయేందుకు (డిస్‌లొకేషన్‌కు) అవకాశం ఉంటుంది. ΄ోస్టీరియర్‌లో గాయం తగ్గేందుకు ఆర్నెల్లు పట్టడం, ప్రతి కదలికలోనూ జాగ్రత్త వహించాల్సిరావడం, డిస్‌లొకేషన్‌ రిస్క్‌ ఉండటంతో చికిత్స తర్వాతా నిశ్చింతగా ఉండటం సాధ్యం కాదు. ఇది క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. 

ప్రశ్న : మరి యాంటీరియర్‌తో ప్రయోజనం ఏమిటి? 
నితీశ్‌ భాన్‌ : ఇంతకుమునుపు చెప్పుకున్న ప్రతి బంధకాలేమీ ఉండవు. ΄ాటించాల్సిన ఆంక్షలు ఒక్కటి కూడా ఉండవు. అంటే జీరో రిస్ట్రిక్షన్స్‌ అన్నమాట. ఎందుకంటే.... యాంటీరియర్‌ శస్త్రచికిత్సలో చిన్న గాటు తప్ప పెద్ద లేదా కీలకమైన కండరాలు వేటినీ కోయనక్కర్లేదు. దీంతో కండరాలు దెబ్బతినడం చాలా చాలా తక్కువ (లెస్‌ టీష్యూ డ్యామేజ్‌); కోలుకునే వేగమూ చాలా ఎక్కువ. అక్కడ కోత గాయం మానడానికి ఆర్నెల్లు పడితే, ఇక్కడ కేవలం 10, 12 రోజులు చాలు. నేను చేసిన కొన్ని శస్త్రచికిత్సల్లో రెండో రోజే పరుగెత్తడం, కొన్ని రోజుల వ్యవధిలోనే వాహనాలు నడపడం జరిగింది.  

వైద్య గణాంకాల ప్రకారం... యాంటీరియర్‌లో ఇలాంటి డిస్‌లొకేషన్‌కు అవకాశాలు కేవలం 1 శాతం లోపే. ఆస్ట్రేలియన్‌ జాయింట్‌ రిజిస్ట్రీ ప్రకారం ΄ోస్టీరియర్‌ పద్ధతిలో డిస్‌లొకేషన్‌ రిస్క్‌ 21.1 శాతం కాగా... యాంటీరియర్‌లో ఇది కేవలం ఒక శాతం కంటే కూడా తక్కువే. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలైతే, ఇప్పటివరకు నేను నిర్వహించిన దాదాపు 450 పైగా సర్జరీల్లో  హిప్‌ డిస్‌లొకేషన్‌ అయిన కేసు, ఫెయిలైన కేసు ఒక్కటి కూడా లేనే లేదు.

ప్రశ్న : మరి అందరూ యాంటీరియర్‌ పద్ధతిలోనే చేయవచ్చుగా? 
నితీశ్‌ భాన్‌ : ఇది సాంకేతికంగా, సునిశితత్వం çపరంగా చాలా ఎక్కువ నైపుణ్యాలు అవసరమైన శస్త్రచికిత్స. దీనికి చాలా నేర్పు కావాలి. సర్జరీ నిర్వహణను ఒక గ్రాఫ్‌లా గీస్తే సునిశితత్వం, నేర్పూ, నైపుణ్యాలూ ఇవన్నీ ఒక నిటారైన గీతలా ఉంటాయి. అంటే... యాంటీరియర్‌ హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌లో అంత సక్లిష్టత ఉంటుందన్నమాట. అందుకే దాదాపు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేసేవారిలో పన్నెండేళ్ల కిందట దేశంలో ఆరేడుగురి కంటే ఎక్కువ లేరు. ఇప్పటికీ నా అంచనా ప్రకారం మహా అయితే తొమ్మిది మది ఉండి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే సీనియర్‌. అంతెందుకు విదేశాల నుంచి కూడా వచ్చి... ముంబైలో కుదరక΄ోవడంతో... అక్కడున్నవారితో వాకబు చేసుకుని...  
అక్కడ్నుంచి ఇక్కడికి వస్తుంటారు. 

ప్రశ్న : ఈ యాంటీరియర్‌ హిప్‌ రీ–ప్లేస్‌మెంట్‌ సర్జీరీకి ఫీజులెలా ఉంటాయి? 
నితీశ్‌ భాన్‌ : హిప్‌ రీప్లేస్‌మెంట్‌లో ఏ రకమైనా ఒకేలాంటి ఫీజు ఉంటుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత రీప్లేస్‌మెంట్‌ కోసం ఉపయోగించే కృత్రిమ కీలు (ప్రోస్థటిక్‌ జాయింట్‌)కే వేర్వేరు ధరలుంటాయి.

డాక్టర్‌ నితీశ్‌ భాన్‌ సీనియర్‌ ఆర్థోపెడిక్‌ అండ్‌ నీ – హిప్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ 

(చదవండి: శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement