
తోబుట్టువుల ఫ్యాషన్ వాక్‌లో అలరించిన చిన్నారులు
అశోక వన్ మాల్ వేదికగా వినూత్న కార్యక్రమం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్‌పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్‌లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.

నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్
చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్‌ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్‌కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు.
ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్‌కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్‌లో గానీ సంప్రదించాలన్నారు.