
హైబీపీ అనేది జీవనశైలికి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య. ఇది ఒకసారి కనిపించాక ఇక దాదాపు బాధితుల జీవితకాలమంతా హైబీపీ వాళ్ల జీవనాన్నీ, అలవాట్లను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నార్మల్‌గా 120 / 80 ఉండాల్సిన బీపీ కొలత అంతకంటే ఎక్కువగా ఉండటాన్ని హైబీపీ లేదా హైపర్‌టెన్షన్‌గా
చెబుతారు.
హైబీపీ ప్రధానంగా జన్యు కారణాల వల్లనే వస్తుంది. అయితే వాళ్ల జీవనశైలిలో భాగంగా వాళ్లు తీసుకునే ఆహారం, దేహానికి దొరికే వ్యాయామం అలాగే వాళ్లు అనుభవించే ఒత్తిడి... ఇవన్నీ హైబీపీ వచ్చేందుకు కారణమవుతుంటాయి.
నివారణ ఇలా...
ఆరోగ్యకరమైన జీవనశైలితో హైబీపీని చాలావరకు నివారించవచ్చు. అదెలాగో చూద్దాం.
ఆహార పరంగా:
ఆహారంలో సోడియమ్ మోతాదులు ఎక్కువగా తీసుకోవడం నేరుగా బీపీని పెంచుతుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌డ్ ఆహారాలు, క్యాన్‌డ్ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే శ్నాక్స్ వంటివి తగ్గించాలి.
పొటాషియమ్ ఉండే ఆహారాలతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అందుకే పొటాషియమ్ మోతాదులు ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఆహారంతో హైబీపీని నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’గా చెబుతారు. ఇందులోని మొదటి అక్షరాలను తీసుకుని సంక్షిప్తంగా ఈ పద్ధతిని ‘డ్యాష్’గా పేర్కొంటారు. డ్యాష్ ఆహారాల్లో భాగంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్‌లతో హైబీపీని నియంత్రించవచ్చు.
వ్యాయామం ఇలా...
ప్రతివారం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం చేస్తుండటం మంచిది.
మానసిక ఒత్తిడి...
దీర్ఘకాలిక ఒత్తిడి హైబీపీకి కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని అదుపు చేసేందుకు యోగా, ధ్యానం, శ్వాసవ్యాయామాల వంటి ప్రక్రియలు అనుసరించడం మేలు.
మద్యం, పొగతాగడానికి దూరంగా...
మద్యం, పొగతాగే అలవాట్లు హైబీపీని మరింత ప్రేరేపిస్తాయి. అందుకే ఆ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు... పొగతాగని వారితో పోలిస్తే పొగతాగేవారిలో... రక్తనాళాల్ని పెళుసుగా మార్చే ‘అథెరో స్కిప్లోరోసిస్’ అనే సమస్య 10 ఏళ్ల ముందుగా వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
మరికొన్ని ఇతర సూచనలు...
స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. దాంతో బీపీ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ∙రోజూ కనీసం 7 – 9 గంటలు కంటినిండా నిద్రపోవాలి.
ఇక క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ ఉంటూ దాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ∙హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మోతాదులో మందులు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్‌కు చెప్పకుండా మానేయడం సరికాదు.
చివరగా... బీపీ రీడింగ్‌ను క్రమం తప్పకుండా ఖచ్చితమైన రీతిలో చూసుకుంటూ, దాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా సుదీర్ఘకాలం పాటు మామూలుగానే జీవించడం సాధ్యమవుతుంది.
డాక్టర్ అంజని ద్వారంపూడికన్సల్టెంట్ కార్డియాలజిస్ట్
(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! మై ప్లేట్ ఫర్ ది డే మెనూ..)
∙