
మీకు విటమిన్ ఇ లోపం ఉంది.. మీకు ప్రోటీన్స్ సరిపోవడం లేదు.. ఈ సప్లిమెంట్స్ తీసుకోండి.. అంటూ సూచించే వైద్యులు, పోషకాహార నిపుణులతో పాటు వాటిని వినియోగించే నగరవాసులూ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో సప్లిమెంట్స్‌ను అతిగా వినియోగించవద్దని హైదరాబాద్ నగరానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ఫలితం ఆధారంగా సూచిస్తోంది. అధిక సప్లిమెంట్స్ వాడకం హానికరం అంటున్న ఎన్‌ఐఎన్.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది.
బలవర్థకమైన ఆహారాల నుంచి దొరకని పోషకాలను సప్లిమెంట్లు/మాత్రలు/క్యాప్సూల్స్ అందిస్తాయి అనేది నిజమే అయినా కొన్ని పోషకాలను సప్లిమెంట్‌లుగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాల సహజ శోషణకు ఆటంకం కలుగుతుందని ఎన్‌ఐఎన్ హెచ్చరిస్తోంది. రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లపై అధికంగా ఆధారపడటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తోంది. తాము సూచించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’లో సూచించిన సమతుల ఆహారం ద్వారా అందేవి మరే ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు అందించలేవని స్పష్టం చేస్తోంది.
’మై ప్లేట్ ఫర్ ది డే’
మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని పోషకాలు మన శరీరానికి అందేందుకు మై ప్లేట్ ఫర్ ది డే అనే ఆసక్తికరమైన మెనూను ఎన్‌ఐఎన్ రూపొందించింది. ఇది మన ఆహారంలో అవసరమైన పోషకాహార స్పష్టతను అందిస్తుంది. రోజువారీ ఆహారం కోసం వివిధ ఆహార సమూహాల ఖచ్చితమైన నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి ‘భారతీయుల పోషక అవసరాలు’ ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు.
రోజుకు 2వేల కేలరీలు.. అదే ఆరోగ్యానికి మేలు
వ్యక్తులు(చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా) తమ పోషక అవసరాలను తీర్చుకునేందుకు రోజుకి 2 వేల కిలో కేలరీలు/ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ‘మై ప్లేట్ ఫర్ ది డే’ చెబుతోంది. అయితే ఇది కేవలం కేలరీలు అందించే ఆహారం మాత్రమే కాకూడదని, దీనిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఇలా ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చడానికి సరైన నిష్పత్తిలో ఉండాలని సూచిస్తోంది.
రోజుకి 2వేల కిలో కేలరీల ఆహారం కోసం..
కూరగాయలు ఆకు కూరలు: 400 గ్రాములు(ముడి బరువు),
మిల్లెట్లతో సహా తృణధాన్యాలు: 260 గ్రాములు,
పండ్లు: 100 గ్రాములు,
పప్పులు/గుడ్లు/మాంసపు
ఆహారాలు: 85 గ్రాములు,
గింజలు విత్తనాలు: 30 గ్రాములు,
కొవ్వులు నూనె: 27 గ్రాములు,
పాలు/పెరుగు: 300 మి.లీ.
శోషించే ఆహారమే.. మేలు
ఆరోగ్యకరమైన సహజ ఆహారాలను శరీరం బాగా గ్రహిస్తుంది. అంతేకాకుండా అవి ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు ఖనిజాల తీవ్రమైన కొరతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం, అన్ని సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫంక్షనల్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని తగినంతగా తీసుకోవడం మంచిదని ఎన్‌ఐఎన్ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’ ఎలా ఉండాలో డిజైన్ చేసి అందిస్తోంది.
స్నాక్స్.. ఆరోగ్యకరంగా..
అవసరమైన కేలరీలకు మించకుండా స్నాక్స్ తినడం వల్ల నష్టం లేదు. కొన్ని రకాల స్నాక్స్ బరువు తగ్గడానికి సహకరిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్. స్నాక్స్‌గా ఆయన గుప్పెడు కాలిఫోరి్నయా ఆల్మండ్స్ సూచిస్తున్నారు. ఈ బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఇవి బెస్ట్, అలాగే నూనె లేకుండా వండిన మూంగ్ దాల్ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైన
మరొక చిరుతిండి. మూంగ్ దాల్(పెసర పప్పు)లో పొటాషీయం, మెగ్నీషియం, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మంచిది. పెసర శనగల మొలకలతో తయారైన భేల్‌లో రుచికరమైన స్నాక్. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు, భేల్ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.
(చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!)