
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...
చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్‌రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు.
వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్‌రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది.
ఎన్నో రకాలు.. ఎన్నో రుచులు
ప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...
పూఎయిర్ టీ
చైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్‌ఫు చా’ అని కూడా అంటారు.
వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్‌లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.
బటర్ టీ
ఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్‌లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.
చా యెన్
ఇది థాయ్‌లాండ్‌లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్‌టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్‌కలర్స్‌ను కూడా జత చేస్తారు.
చాయ్
ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!
రూయిబోస్
నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.
వైట్ టీ
ఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు.
బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
యెల్లో టీ
తేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు.
తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.
∙∙ పురాతన చరిత్ర
టీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్‌కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్‌కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు.
చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్‌కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది.
తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.
గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్‌లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.
చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.
తేయాకు యూరోప్‌కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్‌లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.
తేయాకు కోసం బ్రిటన్‌కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్‌లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది.
బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే!
(చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు)