మెరిసిందని మురిసిపోవద్దు...ఈ జాగ్రత్తలు మస్ట్‌ | Hair Dye: How to take care of Hair after while colouring | Sakshi
Sakshi News home page

Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్‌

Sep 23 2025 10:28 AM | Updated on Sep 23 2025 12:54 PM

Hair Dye: How to take care of Hair after while colouring

చాలామంది హెయిర్‌–డై లను జుట్టు నలుపు చేసుకోడానికే ఉపయోగిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం జుట్టు నలుపు రంగులోనే ఉన్నప్పటికీ దాన్ని మరింత ఫ్యాషనబుల్‌గా తీర్చిదిద్దుకోవడం కోసం రంగులు వేసుకుంటారు. ఇలా ఫ్యాషనబుల్‌గా గ్రూమింగ్‌ చేసుకునే సమయంలో వారు వెంట్రుకల చివర్లను ఎర్రగా మార్చుకునేందుకూ, మరికొందరు మధ్యమధ్యన యూనిఫామ్‌గా కొన్ని పాయలు ఆకర్షణీయమైన రంగులూ, రకరకాల షేడ్స్‌లో కనిపించేలా... ఇలా హెయిర్‌–డైని వేర్వేరు ప్రయోజనాలకోసం వాడుతుంటారు.

ఇటీవల చాలా చిన్నవయసులోనే హెయిర్‌ డై వాడాల్సిన అవసరం వస్తోంది. మరికొందరికైతే  పాతికేళ్లు, ముప్ఫై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది. ఇంకొందరి విషయంలో జుట్టు తెల్లబడకపోయినా... వెంట్రుకలను మరింత ఆకర్షణీయం చేసుకునేందుకు... వెంట్రుక  చివర్లలోగానీ లేదా జుట్టు పాయల్లో  అక్కడక్కడా ఎరుపు లేదా ఇతర రంగుల షేడ్స్‌ను పార్లర్లలోవాడటం జరుగుతోంది. హెయిర్‌ డై లు కొనేప్పుడు ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి, వాటితో వచ్చే సాధారణ ప్రమాదాలు, ఆ ముప్పునుతప్పించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పాటించాల్సిన కొన్ని సాధారణసూచనలు... ఇలాంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం...

తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలర్జీలు
సరిపడుతోందా అనే అంశాన్ని పరిశీలించుకోవడం : మొదటిసారి హెయిర్‌–డై వాడేవారు అది తమకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి. కొద్దిపాటి రంగు పూసుకుని, 48 గంటల పాటు వేచిచూశాక ఏ ముప్పూ లేదా ప్రతికూల పరిణామాలు కనిపించకపోతే దాన్ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ బ్రాండ్‌ హెయిర్‌–డై కారణంగా ఏవైనా అలర్జిక్‌ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం దానికి దూరంగా ఉండటమే మేలు. ఎవరు ఎలాంటి  హెయిర్‌–డై వాడుతున్నప్పటికీ, వీలైనంతలో మన బడ్జెట్‌లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడమే మేలు

రంగు వేసుకునే సమయంలో హెయిర్‌–డైను ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకూడదు. బాగా పలచగా ఉండే కొన్ని రకాల హెయిర్‌–డైలతో ఈ తరహా ముప్పు ఎక్కువగా ఉంటుంది. పలచగా ఉండే హెయిర్‌డైల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తను తప్పక పాటించాలి. 

హెయిర్‌–డై తాలూకు ఘాటైన వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం గానీ  లేదా ఆయాసం రావడంగానీ జరుగుతుంటే... దాని వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్‌ చేసుకోవాలి లేదా మందపాటి మాస్క్‌ ధరించడం మేలు.  

హెయిర్‌–డై పూయడాన్ని కేవలం తలకు మాత్రమే పరిమితం చేయాలి.  కనుబొమలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు, కనురెప్పల వరకు దాన్ని జారనివ్వకూడదు.

గిన్నెలో కలుపుకున్న హెయిర్‌ డైలోకి మనం ఎంచుకున్న బ్రష్‌ను పైపైనే ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లోనే బ్రష్‌కు రంగు అంటేలా హెయిర్‌డైను తీసుకుంటూ జుట్టుకు జాగ్రత్తగా రాయాలి. పెద్దమొత్తంలో హెయిర్‌డైను బ్రష్‌ మీదకు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్‌ మీదకు రంగును తీసుకోవడం వల్ల అది పక్కలకూ లేదా కంటిలోకి కారే ప్రమాదం ఉంది. పక్కలకు కారిన రంగు కాస్త ఇబ్బందికరంగా కనిపించవచ్చు. కానీ అది కంటిలోకి జారితే ప్రమాదం. కొన్ని రకాల హెయిర్‌ డై లోని రసాయనాలు కంటికి హాని చేసే అవకాశముంటుంది.  హెయిర్‌డై కళ్లలోకి స్రవించినప్పుడు కళ్లు విపరీతంగా మండటం, కళ్లు ఎర్రబారడం, కళ్లకు ఇన్ఫెక్షన్‌ రావడమూ జరగవచ్చు. 

హెయిర్‌ డైలోని రసాయనాలు 
వెంట్రుకలోకి ఇంకిపోయి, వెంట్రుకతో ఒక రకమైన రసాయనిక చర్య జరపడం ద్వారా జుట్టును నల్లబారుస్తాయి. అవే రసాయనాలు  వెంట్రుకను బిరుసెక్కేలాగా చేస్తాయి కూడా. అందుకే చాలాకాలంగా హెయిర్‌–డై వాడేవాళ్ల వెంట్రుకలు కాస్తంత రఫ్‌గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్‌గా) ఉండటం గమనించవచ్చు. కొందరు మహిళల్లో హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ చేసుకుంటూ రంగు వేసుకునేవాళ్లుంటారు. అలాంటి వాళ్లలో ఈ తరహా ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది.

కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్‌ డైలోనూ తారు (కోల్‌తార్‌), పీపీడీ (పారాఫినైలీన్‌ డై అమైన్‌– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల కారణంగా చాలా చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునకు అవకాశం ఉంది. కాబట్టి రసాయనాలు కలిగి ఉండే హెయిర్‌–డై లకు బదులుగా వెజిటబుల్‌ హెయిర్‌ కలర్స్‌గానీ, మెడికేటెడ్‌ హెయిర్‌ కలర్స్‌ గానీ వాడుకోవడం సురక్షితం. 

హెయిర్‌ డైతో కనిపించే కొన్ని సాధారణ ముప్పులు... 

అలర్జీ కారణంగా:  హెయిర్‌ డైలో ఉండే రసాయనాలల్లోని కొన్ని కెమికల్స్‌ కొందరి చర్మానికీ లేదా వాళ్ల జుట్టుకు సరిపడక పోవచ్చు. దాంతో ఆ హెయిర్‌ డై వాడకం వల్ల వాళ్లలో అలర్జీ వంటి దుష్పరిణామాలు కలగవచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు (ర్యాష్‌), డై తగిలిన చోట కొద్దిపాటి వాపు, మంట వంటివి కనిపించవచ్చు.

కళ్లూ, పెదవులకూ లేదా  దేహమంతటా వాపురావడం : కొన్ని సందర్భాల్లో రంగు తలకు మాత్రమే పెట్టుకున్నప్పటికీ కళ్లవాపు, పెదవులు ఉబ్బినట్లుగా వాచడం లేదా మొత్తం దేహమంతటికీ వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే బాధితులను వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకెళ్లి డర్మటాలజిస్ట్‌కు చూపించాలి.

రసాయనాల కారణంగా కళ్లమంట : కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాల కారణంగా కళ్లు విపరీతంగా మండటం, కళ్ల నుంచి నీరుకారడం,  గొంతులో గీరుతున్నట్లుగా ఇబ్బంది కలగడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు కలగవచ్చు.

చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు

శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది / ఆస్తమా : పై లక్షణాలు కనిపించిన కొందరిలో ఆ సమస్యల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, శ్వాసతీసుకోవడంలో వాళ్లకు తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చు. కొందరిలో ఇది ఒక్కోసారి ఆస్తమాకు సైతం దారితీయవచ్చు.

అవే రసాయనాలుమరో సందర్భంలో ప్రతికూలంగా...  
మొదట్లో చాలాసార్లు సురక్షితంగా వాడిన ఆ రసాయనాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా ఇతర సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా, అలర్జిక్‌గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి.

డై వేసుకునే సమయంలో గోళ్లకు అంటనివ్వవద్దు
జుట్టుకు హెయిర్‌ డై వేసుకునే సమయంలో ఆ రంగు గోళ్లకు అంటకుండా వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది వెంట్రుక అయినా, గోరు అయినా కెరొటిన్‌ అనే పదార్థంతోనే తయారవుతుంది. అంటే వెంట్రుక, గోరు... ఈ రెండూ హెయిర్‌–డైలోని కెమికల్‌తో ఒకేలా రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల పొరబాటున గోళ్లకు రంగు అంటుకుంటే... జుట్టులాగే గోరు కూడా నల్లగా మారుతుంది. అంటుకున్న రంగు అలాగే ఉండిపోతుంది. 

ఇదీ చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్‌ చేస్తే.!

అయితే పొరబాటున గోళ్లకు అంటుకున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగుతున్న వెంట్రుకలు తమ మొదళ్లనుంచి తెల్లగా కనిపిస్తున్నట్టే... గోరు పెరుగుతున్న కొద్దీ రంగు అంటని భాగం తెల్లగా పెరుగుతూ వస్తుంది. దాంతో పెరిగిన  భాగాన్ని కట్‌ చేస్తున్న క్రమంలో దాదాపు మూడు నెలల వ్యవధిలో నల్లగా మారిన గోరు పూర్తిగా తొలగిపోతుంది. పై కారణాల వల్ల జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ అంటుకు΄ోయే ప్రమాదం ఉన్నందున గోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అవసరం.

గర్భవతుల విషయంలో : మంచి పేరున్న, నాణ్యమైన హెయిర్‌–డైతో చాలావరకు కడుపులో ఉన్న పిండంపై గానీ లేదా తల్లికి గానీ చాలావరకు ఎలాంటి ప్రమాదమూ, ముప్పూ లేకపోయినప్పటికీ... వీలైనంతవరకు ప్రసవం వరకు హెయిర్‌ డై ఉపయోగించకపోవడమే మంచిది. 

చివరగా... హెయిర్‌ డైతో అందం ఇనుమడిస్తుంది. ఫ్యాషనబుల్‌ లుక్‌ వస్తుంది. అయితే వాటికోసం ఆరోగ్యానికీ, కళ్లకూ ముప్పు కలిగించేంత మూల్యం చెల్లించడం సరికాదని గుర్తించాలి.  హెయిర్‌–డైని వీలైనంత ప్రమాదరహితంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. 

డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌, హైదరాబాద్‌.

నిర్వహణ:  యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement