సింపుల్‌గా..శుభంగా

A Great Decision by Couple - Sakshi

ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు. అనే ఆలోచనధోరణి నుంచి బయటికి వచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆఫీసర్‌ ఆర్య, ఇండియన్‌పోస్టల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ శివమ్‌ త్యాగి. ‘ఆనందం అనేది ఆడంబరపు ఖర్చుల్లో కాదు... మనం చేసే మంచి పనుల్లో దొరుకుతుంది’ అని నమ్మిన ఈ నవదంపతులు 20 మంది అనాథ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని వివాహ శుభసమయాన శుభనిర్ణయం తీసుకున్నారు...

కేరళ, కొట్టాయంలోని కూరోప్పడకు చెందిన ఆర్య ఎన్‌ నాయర్‌ తండ్రి రాధాకృష్ణన్‌నాయర్‌ జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌గా రిటైరయ్యారు. కూతురికి చిన్నవయసు నుంచే దినపత్రికలు చదవడం అలవాటు చేశారు. ఈ అలవాటు తనకు ఎంతో మేలు చేసింది. ఎప్పటికప్పుడు సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, రకరకాల సమస్యల విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి కూడా ఆర్యకు ఉపకరించింది. బంధువులకు సంబంధించిన ఎన్నో పెళ్లిళ్లకు హాజరయ్యేది ఆర్య. ఆ ఆడంబరపు ఖర్చును చూసి తన మనసు చివుక్కుమనేది.  ‘ఈ పెళ్లికి చేసిన ఖర్చుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అనుకునేది.

ఇదే విషయాన్ని ఇతరులతో పంచుకుంటే...  ‘ఇప్పుడు ఇలాగే అంటావ్‌. తీరా పెళ్లి టైమ్‌ వచ్చేసరికి మారిపోతావు. నా పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలుసా అని చెప్పుకోవడానికేప్రా ధాన్యత ఇస్తావు. నీ వయసులో నీలాగే ఆలోచించాను. కాని నా పెళ్లి ఘనంగా జరగక తప్పలేదు. చివరికి అప్పు కూడా చేయాల్సి వచ్చింది’ అన్నవాళ్లే ఎక్కువ. ఈ మాటలు ఆర్య మనసులో గట్టిగా నిలిచిపోయాయి.‘పెళ్లంటూ చేసుకుంటే నిరాడంబరంగానే చేసుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంది. దిల్లీకి చెందిన శివమ్‌ త్యాగి కూడా ఆర్యలాగే ఆలోచిస్తాడు.

 ఇద్దరూ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారి పరిచయం స్నేహం అయ్యే క్రమంలో, ఆ స్నేహం ప్రేమకు దారి తీసే క్రమంలో ఎన్నో సామాజిక సంబంధిత విషయాలు మాట్లాడుకునేవారు. అందులో ఆడంబర వివాహాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా ఉండేది. ‘నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆర్య చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. వారిని ఒప్పించడానికి కాస్త సమయం పట్టింది. మరోవైపు శివమ్‌ త్యాగి పరిస్థితి కూడా అంతే. అతడి తల్లిదండ్రులు కూడా నిరాడంబర వివాహానికి మొదట సుముఖంగా లేరు.

‘మా నిరాడంబర వివాహం కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే అంతకంటే గొప్ప ఆనందం ఏం ఉంటుంది!’ అంటున్నాడు శివమ్‌ త్యాగి. ఆనందాలు ఆడంబరపు ఖర్చులతో ముడిపడిన చోట ఆనందం మాటేమిటోగానీ అప్పులు మాత్రమే మిగులుతాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ధోరణిలో మార్పు రావాలంటే నిరాడంబర వివాహాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఆర్య– శివమ్‌ త్యాగిలాంటి వారు ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తారు.

‘కేరళలో వివాహాలు మూడు రోజులపాటు అట్టహాసంగా  జరుగుతాయి. నా పెళ్లి వార్త తెలియగానే బంధువులు  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. పెళ్లి ఆడంబరంగా జరుగుతుందని ఊహించారు. కాని కొట్టాయంలోని సబ్‌– రిజిస్ట్రార్‌ ఆఫీసులో దండలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా జరిగిన మా పెళ్లి వారిని కాస్త నిరాశకు గురిచేసింది. అయితే ఆ తరువాత వారు మమ్మల్ని అర్థం చేసుకొని అభినందించారు’  అంటుంది ఆర్య.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top