75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..! | Grandparents Old Houses Renovated With Modern Features | Sakshi
Sakshi News home page

75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..! ఆధునిక హంగులద్దుకున్న పొదరిల్లు..

Apr 27 2025 2:32 PM | Updated on Apr 27 2025 2:32 PM

Grandparents Old Houses Renovated With Modern Features

ధాన్యాగారంగా మిద్దెలు..  చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. 

బోధన్‌:  పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు.  

ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు 
సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం  పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్‌ పెంకుని అమర్చారు. 

మట్టి గోడలకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. 

ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం  
మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్‌ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం.  – బండారు హన్మాండ్లు సేట్‌   

ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. 
రుద్రూర్‌:  ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్‌ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్‌ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్‌ సేట్‌ తండ్రి విఠల్‌ సేట్‌ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు.   

Advertisement
 
Advertisement
Advertisement