
ఆషాఢమాసం వచ్చిందనగానే ఆడపడచులందరూ చేతికి గోరింటాకు పెట్టుకుని కనిపిస్తారు. ఒకవేళ వాళ్లు పెట్టుకోక΄ోతే ఆ చేతులకు కాస్తంత గోరింటాకు పెట్టుకోండమ్మా... ఆషాఢమాసం వచ్చింది కూడానూ అని బామ్మలు, అమ్మమ్మలు పోరుతుంటారు. ఇంతకీ ఆషాఢమాసానికీ, అర చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికీ సంబంధం ఏమిటో చూద్దాం...
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. ఈ ఉపద్రవాన్ని గోరింటాకు కొన్ని రోజుల పాటు ఆపుతుంది.
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. అందులోనూ ఆషాఢంలో అయితే గోరింట లేత ఆకులతోచక్కగా చిగుళ్లు వేసి ఉంటుంది. ఆ ఆకు కోయడం కూడా ఒంటికి మంచిదే!.
(చదవండి: ఎక్కడ చూసినా గోరింటాకు సందడి : ఈ ప్రయోజనాలు తెలుసా?)