మంచి మాట..జీవన లక్ష్యం

garikapati venkat special story on - Sakshi

ప్రతి మనిషి జీవితానికి  లక్ష్యం అనేది అత్యంత అవసరం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలంటే,  ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సఫలీకృతుడవడానికి అంకిత భావంతో పనిచేయాలి. తనకున్న యావచ్ఛక్తిని వినియోగించి పనిచేస్తే, విజయానికి దారులు తప్పక తెరుచుకుంటాయి. ఈ ధరిత్రిపై లక్ష్యం లేకుండా సాగే ఏ మనిషి  జీవికైనా నిరర్ధకమంటారు స్వామి వివేకానంద.

ఉన్నతపదవి.. వ్యాపారం.. క్రీడలు..లలితకళలు.. యిలా ఏ విభాగంలో మనం రాణిద్దామని అనుకుంటామో, అందులో చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని సావధానంతో నిర్ణయించుకోవాలి. అయితే, లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ప్రతి పనినీ మొక్కవోని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ముందుకు సాగాలి.

మనం పయనించే మార్గంలో విజయంతో బాటు అపజయాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అపజయం సంభవించినప్పుడు కుంగిపోక, లక్ష్యసాధనలో విజయానికి చేరువ కావడానికి మరింత అనుభవం తనకు సమకూడిందని భావిస్తూ సానుకూల దక్పథంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఈ ధరిత్రిలో ఏదీ, తనంత తానుగా మన చెంతకు రాదు.  ఎనలేని శోధన, వలసినంత సాధన తోడైతేనే లక్ష్యం అవలీలగా సొంతమవుతుంది.

మనిషి ఎంచుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి . ఉన్నతంగా ఉండడమంటే  జీవనోపాధికోసం అప్పుడే సాధారణమైన ఉద్యోగంలో జేరినవాడు, వెంటనే అత్యంత సంపన్నుడు కావాలని కోరుకోవడం ఏమాత్రం సబబుకాదు. కానీ, తాను చేరిన వృత్తిలో, ఉద్యోగంలో, కృషి చేస్తే తాను ఎంతవరకు ఎదగగలడు అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. సహేతుకమైన ఆలోచనతో, వివేచనతో ముందుకు సాగుతూ నిజాయితీతో కృషి చేస్తే, తను అనుకున్న ఉన్నతమైన స్థానాన్ని అందుకోలేకపోయినా, ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాన్ని మానవుడు కైవశం చేసుకుంటాడని చరిత్ర నిరూపించిన నిదర్శనాలెన్నో మనకు కనబడతాయి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కషి చేసిన వారందరూ, తమ జీవన గమనంలో అప్రతిహతమైన విజయాలను చేబూనారన్న విషయం చరిత్ర తేజోమయంగా మనకు తెలియజేస్తుంది.

ఈ విజయపరంపరలో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత స్థాయి కి ఎదిగిన వ్యక్తులూ మనకు ఎంతో మంది తారసపడుతూనే ఉంటారు. బీద కుటుంబంలో పుట్టి,  ఉదయాన్నే వార్తా పత్రిక లను పంచే అతి సాధారణ వ్యాపకాన్ని బాలునిగా ఉన్నప్పుడు నిర్వర్తించిన అబ్దుల్‌ కలామ్‌ దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిగా, భారత అణుశాస్త్ర పితామహునిగా నిలవడం కృషితో నాస్తి దుర్బిక్షం అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యం. కలలు కను..కలలను సాకారం చేసుకో’’ అన్న ఆ మహోన్నత వ్యక్తి లక్ష్య సాధకు లకు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే గాక, తన జీవితాన్నే ఆ సుధా మయ వాక్యాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిపిన సార్ధక జీవనుడు.

 లక్ష్యం ఉన్నతమైనదైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే ఆటంకాలేవీ మనల్ని బాధించవు. లక్ష్యాన్ని చేరే గమ్యంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్ళు సాధారణమైనవిగానే మనకు అనిపిస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే చిరు సవాళ్ళు, పెనుసవాళ్ళు కూడా మన విజయానికి బాసటగా నిలిచే పునాదిరాళ్ళుగా మనం విశ్వసించాలి. మనిషికి మహితమైన సహనాన్ని, తనలో తనకు విశ్వాసాన్ని పెంపొందించే మేలురాళ్ళుగా ఈ సవాళ్ళను పేర్కొనవచ్చు.

మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, విజయాన్ని చేబూనిన ప్రతి మానవుడూ మహనీయుడు కాకపోవచ్చు, కానీ సమాజంలో తప్పకుండా మాననీయుడవుతాడు. మహితమైన హితాన్ని నలుగురికీ తద్వారా చేకూరుస్తాడు.

లక్ష్యసాధకునికి తప్పనిసరిగా కావలసింది అచంచలమైన ఆత్మవిశ్వాసం. మానవ చరిత్రను పరికిస్తే లక్ష్యాలను సాధించి, ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు మొదటినుంచీ ఉన్నతులు కావాలనే విశ్వాసంతో పరిశ్రమించి, సాఫల్యతను సాధించారని వారి జీవనచిత్రం తిలకిస్తే మనకు అర్థమవుతుంది.

లక్ష్యం అంటే గురి.. లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితాన్ని గమ్యం తెలియకుండా పయనించే నావతో పోల్చడం సబబుగా ఉంటుంది. మనం ఏ లక్ష్యం కోసమైతే సాధన, పరిశ్రమ కొనసాగిస్తామో, ఆ సాధనలో అవిశ్రాంతంగా కొనసాగితే, ఈ ధరిత్రిలోని ప్రతిశక్తీ మనకు సహకరిస్తుందనే మాట అత్యంత ప్రసిద్ధిని పొందిన ఓ పాశ్చాత్య దార్శనికుని మాట.

– వెంకట్‌ గరికపాటి , వ్యాఖ్యాన విశారద
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top