
అహంకారం అంటే తానే అందరికంటే గొప్పవాడిననీ, అందరూ తనముందు అణిగిమణిగి ఉండాలని భావించడం. అహంకారం, అహంభావం రెండూ ఒకే కోవలోకి వస్తాయి. చరిత్రలో మహితమైన గుణాలతో, సాధులక్షణాలతో అలరారే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అహంకారంతో విర్రవీగేవాళ్ళు సైతం అంతకు తక్కువ మంది లేరు. ఈ అహంకారమనేది సర్వదా వదిలివేయవలసిన దుర్లక్షణం. ఒకరిమీద అహంకరించిన వ్యక్తి ఏం సాధించగలడు? అదే ఆహంకరించడం మాని, మమకారం చూపితే, ప్రపంచమే నీ సొంతమవుతుంది.
ఇతరులను తక్కువగా చూడడం, తన గురించి తాను ఎంతో గొప్పవాడినని భావించడం, తాను చేసిన తప్పులను అంగీకరించకపోవడం, ఎదుటివారి అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వకపోవడం, ఎక్కువగా దంభాలు పలకడం, ఇతరులు చెప్పే మాటలను ఏమాత్రం వినకపోవడం, ఎదుటివారిని పదేపదే విమర్శించడం.. ఇవన్నీ అహంకారుల లక్షణాలు.
అహంకారం అనేది అనర్థదాయకం. అది మానవ సంబంధాలను, వ్యక్తికి ఇతరులతో ఉన్న అనుబంధాలను కూడా దెబ్బ తీస్తుంది. అంతేకాదు.. వ్యక్తిగత పతనానికీ దారి తీస్తుంది. చరిత్ర గతిలో తాము అతి గొప్పవారమని విర్రవీగిన నెపోలియన్, అలెగ్జాండర్ వంటి వారు చివరికి ఏరకంగా నాశనమయ్యారో పరికిస్తే, హద్దులు మీరిన వారి అహంకారమే దానికి కారణమని తెలుస్తుంది.
ప్రతి వ్యక్తీ విసర్జించవలసింది అహంకారం. పక్కవారిపై చూపవలసింది మమకారం. అహంకారాన్ని వీడి, ఇతరుల పట్ల మమకారాన్ని చూపించగలిగితే, ఆ లక్షణం మానవ సంబంధాలను సుధామయం చేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. – ‘అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర’ వెంకట్ గరికపాటి
అహాన్ని వీడిన మకర ధ్వజుడు
అహంకారానికి మారుపేరుగా నిలిచే పాతకాలం నాటి ఒక రాజు కథను పరికిద్దాం. కుంతల దేశాన్ని రవివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహావీరుడు, అతనికి తెలియని యుద్ధవిద్య లేదు. అయితే, అతనిలోని పెద్ద బలహీనత విపరీతమైన అహంకారం. అతని మాటేశానం. ఎవరు తనకు ఎదురుచెప్పినా వినేవాడు కాదు. ఈ విధంగా పరిపాలన సాగుతున్న క్రమంలో రాజుకు ఉన్నట్టుండి ఒక వింతవ్యాధి సోకింది. రాజ్యంలో ఉన్న వైద్యులెవరూ రాజుకున్న వింతరోగాన్ని తగ్గించలేకపోయారు. దానితో మహామంత్రి, ప్రధానసైన్యాధికారి, మిగిలిన వాళ్ళందరూ అన్ని రాజ్యాలూ గాలించి, ఉజ్జయినిలో మకరధ్వజుడనే ఒక గొప్ప సిద్ధవైద్యుడున్నాడనీ, అతని హస్తవాసి చాలా మంచిదని తెలుసుకున్నారు.
అయితే, ఆ వైద్యుడు ఉజ్జయినిని వీడి ఎక్కడికీ రాడనీ, ఎంత పెద్దవాడైనా అక్కడే వైద్యం తీసుకోవాలని అతని సహాయకులు తెలిపారు. సైన్యాధికారి రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. అపర ధన్వంతరి లాంటి ఒక వైద్యుని గురించి విన్నాం. అయితే, చికిత్స కోసం, మీరు ఆ వైద్యుడు ఉండే ఉజ్జయిని వెళ్ళవలసి ఉంటుంది’’ అన్నాడు. అది వినగానే రవివర్మకు ఆగ్రహం తన్నుకొచ్చింది. ‘‘ నేను ఎవరనుకున్నావు. ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళి యిక్కడికి రమ్మని చెప్పు. రాకపోతే బలవంతంగా తీసుకురా..’’ అన్నాడు. చేసేదేం లేక సైన్యాధికారి ఉజ్జయిని వెళ్ళాడు. ఆ వైద్యుని దగ్గర రోగులు తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో ఓపికగా ఔషధాలను యిస్తున్నాడు మకరధ్వజుడు.
అందరూ ఆ వైద్యుని దైవంలా కీర్తించడం గమనించాడు సైన్యాధికారి. కుంతలదేశపు రాజైన రవివర్మ తన రోగ నివారణకు మందులు యివ్వడం కోసం తమ రాజ్యానికి రమ్మంటున్నారని సైన్యాధికారి వైద్యునికి తెలపగా, అతనితో మకరధ్వజుడు ‘‘నాయనా.. నన్ను నమ్ముకుని రోగులు విభిన్న రాజ్యాలనుంచి ఉజ్జయినికి వస్తారు. కాబట్టి వారిని వదిలి నేను ఎక్కడికీ రాలేను..’’ అన్నాడు. అది విని ఆగ్రహించిన సైన్యాధికారి వైద్యునిపై బలప్రయోగం చేయబోయాడు. అక్కడే ఉన్న జనులందరూ కోపగించి, సైన్యాధికారికి దేహశుద్ధి చేశారు. పలాయనం చిత్తగించి, వెంటనే కుంతల రాజ్యానికి తిరుగు పయనమయ్యాడు సైన్యాధికారి. రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. మకరధ్వజుడు మహావైద్యుడు.
కానీ, అసంఖ్యాకమైన రోగులను నిత్యమూ చూడాలి కాబట్టి, ఆయన ఎక్కడికీ రాలేడు. తమరు ఉజ్జయినికి వెళితే, అతి తక్కువ వ్యవధిలో తమ రోగం నయమవుతుందన్న నమ్మకం నాకు ఉంది.’’ అన్నాడు. ఈ లోగా రాజు ఆరోగ్యం మరికొంత క్షీణించింది. ఇక, తప్పనిసరై, తన అహంకారాన్ని వదిలి, ఉజ్జయినికి వెళ్ళిన రాజుకు మకరధ్వజుడు తన నైపుణ్యంతో వైద్యం చేసి, అతని రోగాన్ని నయం చేశాడు. అమితమైన ఆనందానికి గురైన రవివర్మ మకరధ్వజుని వైద్యశాలకు వచ్చే రోగులకు ఉపయోగపడేలా ఎన్నో హంగులు సమకూర్చడమే గాక, తన అహంకారాన్ని తగ్గించుకుని ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించాడు.