అవగాహన అంటే... | Venkat Garikapati about Awareness | Sakshi
Sakshi News home page

అవగాహన అంటే...

Jun 16 2025 1:15 AM | Updated on Jun 16 2025 9:28 AM

Venkat Garikapati about Awareness

అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ఆ పని చేయడానికి కావలసినప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచూ మాట్లాడుతూ ఉంటాం.

అసలు అవగాహన అంటే ఏమిటి? అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చె΄్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న జ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న స్పృహ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే  చేయబోయే పనిమీదప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు.

అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి  తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ అవగాహనగానే పరిగణించాలి.

ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న అవగాహన రాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! 

భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని  చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్దిరోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్నవిశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం.

విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించదలచిన లక్ష్యం పట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమసేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. -వ్యాఖ్యాన విశారద వెంకట్‌ గరికపాటి

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రం. సాధనాక్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియక పోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement