
ఉదయం లేవగానే చాలామంది పిల్లల్లో గేమ్ మోడ్ ఆన్ అవుతుంది. బకెట్‌లో వేడి నీళ్లు సిద్ధం అయ్యేలోపే ‘పబ్‌జీ’లో స్క్వాడ్ రెడీ చేసేసుకుంటారు. లంచ్‌బాక్స్ చేతికి వచ్చే సమయానికి ‘ఫోర్ట్‌నైట్’లో నాలుగు ఫైటింగ్ స్టంట్స్ చేసేసి ఉంటారు. ఇలా చాలామంది ఇళ్లల్లో స్క్రీన్ బ్రైట్‌నెస్‌తో గది మెరిసిపోతుంటే, వర్జీనియాలో ఉండే రోమిర్ అనే పన్నెండేళ్ల అబ్బాయి ఇంట్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి.
గేమ్‌లో పొగలు వస్తే అలర్ట్ మోడ్‌కి వెళ్లిన ట్లు, అచ్చం అలాగే, రియల్ లైఫ్‌లోనూ ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడే మోడ్‌ను రోమిర్ యాక్టివేట్ చేశాడు. చేతిలో గన్ లేకపోయినా, అసలైన ధైర్యం, మెదడులో మెగాబైట్ల బుద్ధి ఉపయోగించి, వెంటనే ఫైర్‌స్టేషన్ కు ఫోన్ చేశాడు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు’ అని హీరో అనుకోడు కదా! అందుకే, సోఫాలో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను, ఒక్క చేతిలో ఒకరిని, ఇంకొక చేతిలో ఇంకొకరిని ఎత్తుకొని, జెట్ స్పీడ్‌తో డోర్ దాటి బయటకు తెచ్చి, సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. తర్వాత మళ్లీ లోపలికి వెళ్లి, మోకాళ్ల నొప్పులతో నడవలేని నాన్నమ్మను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు.
ఫోన్ చేసిన నాలుగు నిమిషాల్లో అసలైన ఫైర్‌ఫైటర్లు వచ్చారు. కాని, అప్పటికే రోమిర్ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అప్పుడు వాళ్లు చూసింది కాలిపోయిన ఇల్లు మాత్రమే కాదు, నల్లటి పొగలో మెరిసిపోతున్న చిన్న హీరోని కూడా. అప్పుడు ఫైర్ డిపార్ట్‌మెంట్ ఒకటే మాట చెప్పింది ‘నీ టాలెంట్ మా ఫైర్‌ఫోర్స్‌లో చాలా అవసరం. నీకు పద్దెనిమిదేళ్లు వచ్చిన వెంటనే ఫైర్‌ఫైటర్ జాబ్ నీదే!’ అని. ఇలా రోమిర్ ఆడిన అసలైన అడ్వెంచర్ గేమ్– అతని జీవితాన్ని సెట్ చేయడమే కాదు, దీంతో అతడి స్కోర్ బోర్డ్‌లో ‘రోమిర్ – ది రియల్ లైఫ్ ఫైర్ ఫైటర్!’ అనే టైటిల్ కూడా జతపడింది.