పైడిమర్రి రామకృష్ణ
అనగనగా ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి పక్కపక్కనే కాపురముండేవి. ఎవరి ఆహారం అవి సంపాదించుకుని తింటూ కాలక్షేపం చేసేవి. ఒకరోజు కోతి తన బిడ్డను కడుపునకు తగిలించుకుని ఆహారం కోసం బయటకు వెళ్లింది. కానీ ఆ రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలి కడుపుతోనే ఇంటికి తిరిగి వచ్చింది. కనీసం తన బిడ్డకు కూడా ఆహారం పెట్టలేక పోయినందుకు బాధ పడింది. కోతికి పక్కనే ఉన్న నక్క ఇంట్లోంచి కమ్మటి పెసర గారెల వాసన వచ్చింది. ‘అబ్బ! కమ్మటి వాసన! నక్కబావ పెసర గారెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే గారెలు పెడతాడు. దాంతో తన బిడ్డ ఆకలి ఈ పూటకు తీర్చవచ్చు’ అనుకుంది.
నక్క ఇంటి తలుపు కొడుతూ, ‘నక్క బావా! నక్క బావా! తలుపు తియ్యవా!’ అంది కోతి. నక్క వెంటనే తలుపు తీయలేదు. తను వండిన పెసర గారెలు కోతికి కనిపించకుండా దాచింది. గారెలు తింటున్న తన పిల్లల్ని పక్క గదిలోకి పంపింది. ఆ తరువాత నెమ్మదిగా తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే కమ్మటి పెసర గారెల వాసన కోతిని చుట్టేసింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగింది.
‘నక్క బావా! ఏంటి విశేషం! మీ ఇంట్లో గారెల వాసన వస్తోంది’ అంది చుట్టూ పరికించి చూస్తూ కోతి.‘గారెలా! బూరెలా! ఎక్కడా ఆహారం దొరకక పోయేసరికి పిల్లల ఆకలి రాగాలు వినలేక ఇంట్లో ఉన్న గుప్పెడు పెసర్లతో మూడంటే మూడే గారెలు చేసి రెండు పిల్లలకి పెట్టి ఇప్పుడే ఒకటి నేను తిన్నా!’ నీరసంగా అంది నక్క. ఆశించిన పెసర గారెలు కోతికి నక్క పెట్టలేదు. నిరాశతో కోతి తన బిడ్డతో వెనక్కి వచ్చేసింది. కోతి వెళ్లటం గమనించిన నక్క దాచు కున్న గారెల్ని బుక్కింది.
ఓ రోజు నక్క తన పిల్లలతో అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దాంతో నీరసంగా తన ఇంటికి చేరింది. నక్కకు పక్కనే ఉన్న కోతి ఇంట్లోంచి కమ్మటి బూరెల వాసన వచ్చింది.‘అబ్బ! కమ్మటి వాసన! కోతి బావ బూరెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే బూరెలు పెడతాడు. దాంతో తన బిడ్డల ఆకలి ఈ పూటకు తీర్చవచ్చని’ ఆశించింది నక్క. కోతి ఇంటి తలుపు కొడుతూ, ‘కోతి బావా! కోతి బావా! తలుపు తియ్యవా!’ అంది నక్క.
తింటున్న బూరెను పక్కన పెట్టి వెంటనే తలుపు తీసింది కోతి. తలుపు తెరుచుకోగానే కమ్మటి బూరెల వాసన నక్కను చుట్టేసింది. దాంతో దాని ఆకలి మరింత పెరిగింది. కోతి బూరెలు పెడితే బాగుండనుకుంది. గతంలో ఆకలితో వచ్చిన కోతికి ఒక్క గారె ముక్క కూడా పెట్టకుండా పంపిన సంఘటన గుర్తుకు వచ్చింది. కోతి కూడా తన బిడ్డల్ని ఆకలి కడుపుతో వెనక్కి పంపుతుందనుకుంది. కాని, కోతి అలా చేయలేదు.
నక్కను, దాని పిల్లల్ని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది. తను తినటానికి పెట్టుకున్న బూరెల్ని నక్కకు, దాని పిల్లలకు పెట్టింది. ‘కోతి బావా! నీకు బూరెలు ఉన్నాయా?’ ప్రశ్నించింది నక్క.‘ఇప్పుడే ఒకటి తిన్నాను. అతిథులైన మిమ్మల్ని తృప్తి పరచటం నా బాధ్యత. ముందు మీరు తినండి’ అంటూ మరో రెండు బూరెలు వడ్డించింది కోతి. నక్క తినలేక పోయింది. కోతి ప్రేమకు చలించిపోయింది.
‘కోతిబావా! చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఆ రోజు నీకు, నీ బిడ్డకు తినటానికి సరిపోను పెసర గారెలున్నా ఆకలి కడుపుతో వెనక్కి పంపాను. గారెలు లేవని అబద్ధం చెప్పాను. ఈ రోజు నువ్వు తినటానికి పెట్టుకున్న బూరెల్ని మాకు అందించి మా ఆకలి తీర్చావు’ ఉబికి వచ్చిన కన్నీటి పొరలను తుడుచుకుంటూ అంది నక్క.
కోతి చిరునవ్వుతో నక్కను దగ్గరకు తీసుకుని, ‘నక్క బావా! మనం ఇతరుల నుంచి ఏమి కోరుకుంటామో, ఏమి ఆశిస్తామో వాటినే ఇతరులకు చేయటం నిజమైన ధర్మం’ అంది కోతి. నక్కకు తన తప్పు తెలిసింది. ఆనాటి నుండి ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించడమే కాకుండా, తను ఇతరుల నుండి ఏమేమి కోరుకుంటుందో, వాటిని ముందుగానే ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంది.


