మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్‌ పరోటా ట్రై చేయండిలా..! | Funday Special: Different Indian Recipes You Can Make It | Sakshi
Sakshi News home page

మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్‌ పరోటా ట్రై చేయండిలా..!

Jul 6 2025 4:40 PM | Updated on Jul 6 2025 4:51 PM

Funday Special: Different Indian Recipes You Can Make It

కోల్‌కతా మొఘలాయ్‌ పరోటా

కావలసినవి: మైదా పిండి– 2 కప్పులు, ఉప్పు– అర టీస్పూన్, నీళ్ళు– తగినన్ని, గుడ్లు– 4 , ఉల్లిపాయ– 1 (మీడియం సైజు, చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 3 (చిన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌– 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు– 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు– తగినంత, చిల్లి ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా– అర టీస్పూన్‌ చొప్పున, కీమా– అర కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), నూనె– సరిపడా

తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు, 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తరువాత, కొద్దికొద్దిగా నీళ్ళు కలుపుతూ, చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దకు నూనె రాసి, ఒక తడి క్లాత్‌తో కప్పి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కన ఉంచాలి. ఇలా చేయడంతో పిండి బాగా నాని, పరోటాలు సాఫ్ట్‌గా వస్తాయి. ఈలోపు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లి ఫ్లేక్స్‌ అన్నీ వేసి బాగా కలపాలి. 

ఇప్పుడు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, మైదా పిండి జల్లుకుంటూ, దీర్ఘచతురస్రాకారంగా, బాగా పలుచటి చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పరోటాలో, నాలుగు టేబుల్‌ స్పూన్ల కీమా–మసాలా మిశ్రమాన్ని నింపుకుని సగానికి ఫోల్డ్‌ చేసుకుని, చివర్లు చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి పరోటాను అలానే చేసుకుని, పాన్‌ లో కొద్దికొద్దిగా నూనె పోసుకుని, ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. నచ్చిన విధంగా ఫోల్డ్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.


తూలుంబా మాసిడోనియా జిలేబీ
కావలసినవి:  పంచదార– 3 కప్పులు, ఏలకుల పొడి– అర టీ స్పూన్‌
నిమ్మరసం– ఒక టేబుల్‌ స్పూన్, నీళ్లు, నూనె– సరిపడా
మైదాపిండి– 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌– ఒక టీస్పూన్, గుడ్లు– 6
తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు నీళ్లు, అర కప్పు నూనె వేసుకుని, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ చిన్న మంట మీద పెట్టి, మరుగుతున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదా పిండి, బేకింగ్‌ పౌడర్‌ వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ముద్దలా అవ్వగానే స్టవ్‌ ఆఫ్‌ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత గుడ్లు కొట్టి అందులో వేసుకుని బాగా గిలకొట్టినట్లుగా, క్రీమ్‌లా మారేలా బాగా కలుపుకోవాలి. 

ఇప్పుడు కవర సాయంతో, కేక్స్‌పైన డిజైన్స్‌ వాడే కోన్స్‌లా చేసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు డీప్‌ ఫ్రై చేసుకోవడానికి నూనె కాచి, దానిలో ఈ కోన్స్‌ తో గట్టిగా నొక్కి, ముక్కలుగా కత్తెరతో కట్‌ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈలోపు పంచదార, సరిపడా నీళ్లు, ఏలకుల పొడి, నిమ్మరసం వేసుకుని లేత పాకం పట్టుకుని.. ఆ పాకంలో వేగిన ముక్కలను వేసుకుని నాననిచ్చి సర్వ్‌ చేసుకోవాలి.


పనీర్‌ బర్ఫీ
కావలసినవి: పనీర్‌ తురుము– ఒక కప్పు
మిల్క్‌ క్రీమ్‌– పావు కప్పు, పంచదార పొడి– రుచికి సరిపడా
ఏలకుల పొడి– చిటికెడు, నెయ్యి– 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు
పిస్తా, కుంకుమపువ్వు– కొద్దికొద్దిగా (గార్నిష్‌ కోసం, సన్నగా తరిగినవి)

తయారీ: ముందుగా నాన్‌–స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. అనంతరం దానిలో పనీర్‌ తురుము, మిల్క్‌ క్రీమ్, ఏలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉంచి, ఆ మిశ్రమంలో పంచదార పొడి వేసుకుని, సుమారు 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం దగ్గరపడగానే చిన్న చిన్న పేపర్‌ కప్స్‌లో నింపుకుని చేత్తో ఒత్తుకుని నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకోవాలి. 

(చదవండి: అప్పుడు ఆశ్చర్యపరిచాయి..ఇప్పుడు అలవాటుగా మారింది..! విదేశీ మహిళ ప్రశంసల జల్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement