
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ పారికలలో అరుదైన ఉడుత మంగళవారం దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన పాంగి చందు అనే రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో ఉడుత ఎగురుతూ అటూ ఇటూ సంచరిస్తూ పొలంలో సందడి చేసింది. ఆ దృశ్యాన్ని చూస్తుండగానే ఒక్కసారిగా గాల్లోంచి కింద పడిపోయిందని, దగ్గరకెళ్లి చూస్తే ప్రాణం లేదని చందు తెలిపాడు.
విశాలమైన రెక్కలు, పొడవాటి తోకతో చూడటానికి గబ్బిలంలా ఉందని, మునుపెన్నడూ ఇలాంటి రెక్కలున్న ఉడుత (Flying Squirrel) తారసపడలేదని రైతు తెలిపాడు.
శివుడ్ని దర్శించుకున్న వానరం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శ్రీసర్వమంగళాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోని శివుడిని మంగళవారం ఓ వానరం దర్శించుకుని తన భక్తిని చాటుకుంది. దీన్ని గమనించిన భక్తులు తమ సెల్‌ఫోన్లలో ఆ సన్నివేశాన్ని బంధించారు. ఆ వానరం (Monkey) శివలింగం వద్ద కొంత సమయం గడిపి అక్కడ ఉన్న ప్రసాదం స్వీకరించడాన్ని చూసిన భక్తులు పులకించారు.

కలియుగంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయని, ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులు ఏదో రూపంలో తమ భక్తిని ప్రదర్శిస్తుంటాయని శ్రీవిద్యా సర్వమంగళా పీఠాధిపతి మురపాక కాళీదాసుశర్మ యాజీ తెలిపారు.
చదవండి: ఉడుతలు కూడా పగబడతాయా?