అప్పులతో విలవిల!
ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాల తీరు, క్షేత్రస్థాయిలో గిరిజనులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్‌మన్ పథకం.. అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం ఆదివాసీలకు శాపంగా మారింది. ఇటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు నాలుగు నెలలుగా నిలిచిపోవడం, అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష అదనపు సాయం ఊసే లేకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పులు తెచ్చి పునాదులు వేసిన ఇళ్లు మధ్యలోనే ఆగిపోగా, ఇళ్లు పూర్తి చేసుకున్న వారు వడ్డీలు కట్టలేక తల్లడిల్లుతున్నారు. ఈ ఆర్థిక సంక్షోభానికి నిరసనగా ఆదివాసీ సంఘాలు నేడు చలో పాడేరు ఐటీడీఏకు పిలుపునిచ్చాయి.
సొంతింటి కల..
ఆర్థిక ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం ఫైనల్ బిల్లుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష అదనపు ప్రోత్సా హం కోసం నిరీక్షిస్తున్నాం.ఇళ్ల నిర్మాణం పూర్తయిన బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం.శ్లాబ్ కూడిన ఇళ్ల నిర్మాణాలకు ఎంతో కష్టపడ్డాం. ఫైనల్ బిల్లు అందక ఇబ్బందులు పడుతున్నాం.
– పాంగి కొండమ్మ, లబ్ధిదారు,
మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం
సాక్షి, పాడేరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్‌మన్ పథకం కింద ఆదివాసీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడింది. గత నాలుగు నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లావ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
● జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 28,691 ఇళ్లు మంజూరు కాగా, 25,553 మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పటివరకు కేవలం 3,138 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లన్నీ నిధులు అందక వివిధ దశల్లో నిలిచిపోయాయి.
● కేంద్ర ప్రభుత్వ వాటా: ప్రతి ఇంటికి రూ.2.80 లక్షల ప్రోత్సాహకం.
● రాష్ట్ర ప్రభుత్వ వాటా: అదనంగా రూ. లక్ష ఆర్థిక సాయం. జిల్లాలో సుమారు సుమారు 10 వేల ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.10 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులు
ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసిన 3,138 మంది లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష అదనపు సాయం అందలేదు. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, ఇటు రాష్ట్ర సాయం అందకపోవడంతో ఆదివాసీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పాలకులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
నేడు చలో పాడేరు ఐటీడీఏ
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శుక్రవారం ‘ఛలో పాడేరు ఐటీడీఏ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ఆందోళనకు సిద్ధమయ్యారు.
వేడుకుంటున్నా ఫలితం శూన్యం
పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రూ.1.50 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది.
– పాంగి చిట్టిబాబు, తీగలవలస పంచాయతీ, హుకుంపేట మండలం
పీఎం జన్‌మన్ పథకానికి నిధుల గండం
నిలిచిన బిల్లుల చెల్లింపులు
జిల్లావ్యాప్తంగా
సుమారు రూ.10 కోట్ల బకాయిలు
అందని రాష్ట్ర సర్కారు అదనపు సాయం
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న
గిరి పుత్రులు
నేడు ‘చలో పాడేరు ఐటీడీఏ’
సమస్యలు పట్టని పాలకులు
పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం రూ.లక్ష చెల్లించాలని ఆదివాసీలంతా వేడుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. శుక్రవారం ఛలో పాడేరు ఐటీడీఏ చేపట్టి ఆదివాసీల పక్షాన పోరాటం చేస్తున్నాం.
– పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అరకులోయ
అప్పులతో విలవిల!
అప్పులతో విలవిల!
అప్పులతో విలవిల!
అప్పులతో విలవిల!


