Fashion: ఉగాదికి ఓణీ... తక్కువ ఖర్చుతోనే ఇలా అందంగా!

Fashion: Hyderabad Designer Taruni Sri Giri New Designs For Ugadi - Sakshi

కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు.  నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. 

తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్‌ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు.

హైదరాబాద్‌ మేడ్చల్‌లో ఉంటున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ తరుణి సిరిగిరి వేడుకలలో లంగా– ఓణీ చేనేత హంగామా గురించి ఇలా అందంగా పరిచయం చేస్తున్నారు. ‘‘సాధారణంగా వేడుకల్లో లెహంగా డిజైన్స్‌ భారీ ఫ్లెయిర్, నెటెడ్‌ మెటీరియల్‌తో చూస్తుంటాం. కానీ, ఇది వేసవి కాలం. ఈ సీజన్‌కి తగ్గట్టు మన అలంకరణ కూడా ఉంటే రోజంతా సౌకర్యంగా ఉండటంతో సందర్భాన్ని మరింతగా ఆనందిస్తాం.  

పచ్చని సింగారం కంచిపట్టు  
సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్‌ ఒక రంగు కాంబినేషన్‌ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్‌ కలర్‌ వాడతారు. ఇక్కడ పచ్చదనం మరింతగా హైలైట్‌ అవడానికి బ్లౌజ్, దుపట్టా రెండూ ఒకే రంగులో ఉన్నవి ఉపయోగించాను.

ఇష్టమైన ఇకత్‌ 
ప్లెయిన్‌ ఇకత్‌ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్‌ లేకపోతే ఎలా అని ఆలోచిస్తారు. అందుకే, అంచుభాగాన్ని ఎంబ్రాయిడరీ చేసి, ఈ లెహెంగాను డిజైన్‌ చేశాను. అలాగే, బ్లౌజ్‌ ప్యాటర్న్‌ కూడా అదేరంగు ఇకత్‌తో డిజైన్‌ చేసి, కాంట్రాస్ట్‌ ఓణీని వాడాను. ఇది ఏ సంప్రదాయ వేడకకైనా అమ్మాయిలకు ఎవర్‌గ్రీన్‌ కాన్సెప్ట్‌ అవుతుంది- తరుణి సిరిగిరి, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌ 

 భామకు గొల్లభామ 
తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్‌ మెటీరియల్‌ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్‌ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్‌ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్‌ వచ్చేలా హైలైట్‌ చేసుకోవచ్చు.

గ్రాండ్‌గా గద్వాల్‌ పట్టు 
వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. పెద్ద అంచు ఉన్న గద్వాల్‌ పట్టుతో డిజైన్‌ చేసిన లంగా ఓణీ కాంబినేషన్‌ ఇది.

– ఎన్‌.ఆర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top