
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు. సిల్క్ దారాలు, అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, ప్యాచ్‌వర్క్‌తో రూపు కట్టిన ఈ నగలు అందరి చూపులను ఇట్టే కట్టడి చేస్తాయి.
తేలికగా.. అందంగా!
లైట్ వెయిట్: సాధారణ గోల్డ్/ సిల్వర్ జ్యూవెలరీలతో పోలిస్తే ఈ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిలోనూ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్స్, మాంగ్ టిక్కా, రింగ్స్,... వివిధ రకాల మోడల్స్‌లో ఎంచుకోవచ్చు.
కస్టమైజ్డ్ : డిజైన్, రంగులు, శైలి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుంటుంది. డ్రెస్‌ని బట్టి మోడల్‌ని, కలర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
వెరైటీ ఆఫ్ డిజైన్స్: మొఘల్, జర్దోసి, మిర్రర్ వర్క్, గుజరాతీ వర్క్... లాంటి అనేక శైలులను ఈ ఎంబ్రాయిడరీలో చూపవచ్చు.
పూర్తి ఎకో–ఫ్రెండ్లీ: సహజమైన వస్తువులతో తయారవడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాదు.
వేడుకలకి అనుకూలం: సంప్రదాయ, ఇండో – వెస్ట్రన్ స్టైల్ డ్రెస్‌లకి ఇది సరైన ఎంపిక.
సొంతంగా తయారీ!
ఎంబ్రాయిడరీ హూప్‌ను కొనుగోలు చేసి, మల్టీ కలర్ దారాలు, ఫ్యాబ్రిక్ గ్లూతో నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు. పర్యావరణహితమైన ఉత్పత్తులు కావడం, రీసైక్లింగ్ చేసే సదుపాయం కూడా ఈ ఆభరణాల తయారీలో చూపించవచ్చు.
వేడుకకు తగిన ఆభరణం
ఉపయోగించే మెటీరియల్స్‌ని బట్టి ఆభరణం ఉంటుంది కాబట్టి వేడుకను బట్టి డిజైన్‌ని ఎంచుకోవచ్చు.
సిల్వర్, జరీ దారాలతో జర్దోజి, మొఘల్ వర్క్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ చేసిన ఆభరణాలను సంప్రదాయ వేడుకలలో లెహంగాలు, శారీలకు ఎంచుకోవచ్చు.
కాథా అనే వర్క్ బెంగాలీ ఫోక్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. రంగుల దారాలతో లైట్ వెయిట్ జ్యూవెలరీని రూపొదించవచ్చు. ఇవి ప్లెయిన్, ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకు, కాటన్ చీరలకు బాగా నప్పుతాయి.
గుజరాత్ కచ్ వర్క్, రాజస్థాన్ కళా శైలిని ప్రతిబింబించేలా పూలు, అద్దాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఆభరణాలు సంప్రదాయ పండుగలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, కాలేజీ ఫంక్షన్లు.. వంటి వాటిలో స్టైల్‌గా కనిపిస్తాయి.
లేస్ మెటీరియల్‌తోనూ రంగు దారాలతో పూలు, ఆకులు కుట్టి, ఆభరణంగా ధరించవచ్చు. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి