క్యాన్సర్‌.. అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు

Facts And Doubts About Cancer - Sakshi

విద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. క్యాన్సర్‌ అని తెలియగానే ఎన్నో సందేహాలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్సకు లొంగే క్యాన్సర్‌ గురించి ప్రముఖ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ చిగురుపాటి మోహనవంశీ గారు మీకందిస్తున్న వివరాలను తెలుసుకోండి. 

క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? 
క్యాన్సర్‌ సోకిన అవయవాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. అన్ని రకాల క్యాన్సర్‌లలో కనిపించే సాధారణ లక్షణాలు... తీవ్రమైన అలసట. జ్వరం, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, రక్తహీనత. (ఇవన్నీ క్యాన్సర్‌ ముదిరాక కనిపించే కొన్ని లక్షణాలు). 

క్యాన్సర్‌ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? 
శరీరం మొత్తంలో క్యాన్సర్‌ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్‌ వచ్చిందని అనుమానిస్తే... ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్‌ఎన్‌ఏ టెస్ట్, బ్లడ్‌ మార్కర్స్, ఎక్స్‌–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌ ఇలా... అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మియర్‌ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. 

క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌ లేదా? 
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు కారణం హెచ్‌పీవీ వైరస్‌ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్‌ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. (అండాశయం, గొంతుక్యాన్సర్‌ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్‌ పనిచేయవచ్చని... 40 ఏళ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని డాక్టర్స్‌ సలహా ఇస్తుంటారు).   

క్యాన్సర్‌ నివారణ మన చేతుల్లో లేదా? 
సర్వైకల్‌ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్‌ గురికాకుండా చూసుకోవడం ద్వారా క్యాన్సర్‌ రాకుండా ప్రయత్నం చేసినవాళ్లమవుతాం. 

ఏదైనా క్యాన్సర్స్‌ వంశపారంపర్యమా? 
ఖచ్చితంగా చెప్పలేం గానీ... మిగతావారితో పోలిస్తే... రొమ్ముక్యాన్సర్‌ ఉన్నప్పుడు రక్తసంబంధీకుల్లో ఆ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ. బీఆర్‌సీఏ–1, బీఆర్‌సీఏ–2 వంటి జీన్‌ మ్యూటేషన్‌ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడచ్చు. రొమ్ము క్యాన్సర్‌ బాధితులు 80% వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి మహిళా తన 20వ ఏటి నుంచే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి. నెలసరి అయిన ఏడో రోజున సబ్బు చేతులతో వేళ్ల మధ్యభాగంతో రొమ్ములను పరీక్షించుకుని, చిన్న చిన్న గడ్డలు ఏవైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల పైబడ్డాక మామోగ్రామ్‌ వంటివి ముప్పు ఉన్నవారు ఏడాదికి ఒకసారి లేదా ఇతరులు మూడేళ్లకు ఓసారి చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం సాధ్యం. 
 
క్యాన్సర్‌కు వయోభేదం లేదా? 
లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. పెద్ద వయసు వారిలో వచ్చే క్యాన్సర్స్‌ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్‌ చికిత్స అన్నది కూడా రోగి వయసును బట్టి మారుతూ ఉంటుంది. 

క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? 
పరిశోధకులు క్యాన్సర్‌ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) చాలావరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్‌ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్‌ పద్ధతిలో చేసే కీ–హోల్‌ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్‌ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్‌ అదుపులో ఉంది అంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్‌ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్‌లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top