
ఇంతకు మునుపు పదివేల అడగులు నడిస్తే..దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదు జస్ట్ ఏడు వేల అడుగులతో కూడా అనారోగ్య సమస్యల తోపాటు అకాల మరణాన్ని కూడా నివారించొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ కొంచెం నడకతోనే చాలమటుకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతోంది అధ్యయనం. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!.
మంచి ఆరోగ్యానికి పదివేల అడుగులని ప్రామాణికంగా చెప్పాయి గత అధ్యయానాలు..కానీ తాజా పరిశోధనలు అంత కష్టపడాల్సిన పనిలేదంటోంది. ఏడు వేల అడుగులతోటే గుండె జబ్బులు, చిత్త వైకల్యం, అకాల మరణాన్ని నివారించొచ్చు. అందుకోసం దాదాపు 35 వేల జనసముహాలపై 57 అధ్యయనాలు నిర్వహించారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో ఎక్కువగా నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే తేలింది.
అయితే అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి దాదాపు ఏడు వేల అడుగులు చాలని నిర్థారించారు. దాంతోనే పలు ప్రయోజనాలు పొందగలమని తెలిపారు పరిశోధకులు. రోజుకి రెండు వేల అడుగులు మాత్రమే నడిచిన వ్యక్తులతో పోలిస్తే..ఏడు వేల అడుగులు నడిచిన వారు ఎలాంటి ప్రయోజనాలు పొందగలరో సవివరంగా వెల్లడించింది కొత్త అధ్యయనం. అవేంటంటే..
ఏ కారంణ చేతనైనా ముందుగా చనిపోయే ప్రమాదం 47% కంటే తక్కువ
గుండె జబ్బు వచ్చే ప్రమాదం 25% తక్కువ
గుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం 47% తక్కువ
కేన్సర్‌తో చనిపోయే ప్రమాదం 37% తక్కువ
అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 38% తక్కువ
డిప్రెషన్ ప్రమాదం 22% తక్కువ
టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14% తక్కువ
కాలు స్లిప్ అయ్యి చనిపోయే ప్రమాదం 28% తక్కువ
ఆ లెక్క ఏంటంటే..
డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి తగినంత వ్యాయామం లేదు. మంచి కదలిక లేకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్‌తో సహా 8% సంక్రమిత వ్యాధుల బారినపడుతున్నట్లు డబ్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ అనారోగ్య సమస్యల కారణంగా ఏటా బిలియన్ల కొద్ది డబ్బు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది.
అలాంటి సమస్యలన్నింటిని సింపుల్ చక్కటి నడకతో చెక్ పెట్టొచ్చన్న దిశగా పరిశోధనలకు నాంది పలికామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ నేపథ్యంలోనే ప్రామాణికంగా ఎన్ని అడుగులు వేస్తే ప్రజలు అత్యంత సౌలభ్యకరంగా తమ ఆరోగ్యాన్ని రక్షించుకోగలరు అనే దానిపై పలు అధ్యయనాలు నిర్వహించామని వెల్లడించారు. అందరికి జిమ్ సౌలభ్యం ఉంకపోవచ్చు లేదా వెళ్లగలిగే సామర్థ్యం లేకపోవచ్చని అన్నారు. అదే వాకింగ్ అయితే సామాన్యుడి సైతం చేయగలిగేదే గాక మెరుగైన ఆరోగ్యాన్ని చాలా సులభంగా పొందగలుగుతాడని పరిశోధకులు చెబుతున్నారు.
(చదవండి: బరువు తగ్గడానికి ఉపయోగపడే అద్భుత పానీయాలు..!)