Shonke Village Story: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట..

Ethiopias 900 Year Old Shonke Village On Top Of A Mountain - Sakshi

ఇంటింటికీ ఓ సందు.. సందుసందుకీ ఓ దారి సహజమే. అలాంటిది, కొన్ని వందల ఇళ్లు ఉండే ఊరంటే.. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.  సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉంటాయి. కానీ ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి రావాలి, లోపలికి పోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు కలిగి, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి.

ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం ఉంది. ఆ ఊరు పేరు షోంకే. తొమ్మిదొందల ఏళ్ల క్రితమే అది ఏర్పడింది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. 

మహ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పుడు ఆయాప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో దాడుల నుంచి కాపాడేందుకు.. కొందరిని ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి పంపించారు అప్పటి పాలకులు. భద్రత కారణాలతో అప్పట్లోనే ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు గార్డులు కాపలా కాస్తుంటారు.

ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచినది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట. 

‘ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేము దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదు’ అంటున్నారు మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచింది.

చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top